Mirzapur 3: ‘మీర్జాపూర్‌ 3’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్‌..

‘మీర్జాపూర్‌ 3’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. 

Published : 20 Mar 2024 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలో మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ (Mirzapur) ఒకటి. ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో మూడో సీజన్‌ ‘మీర్జాపూర్‌ 3’ (Mirzapur 3) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అమెజాన్‌ విడుదల చేసింది. ముంబయిలో జరిగిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈవెంట్‌లో ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ఇందులో కీలకపాత్ర పోషించిన అలీ ఫజల్‌ దీని గురించి మాట్లాడుతూ మూడో సీజన్‌లో ఎన్నో కొత్త పాత్రలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఇది మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. దీని టీజర్‌ను విడుదల చేయగా    అది చూసి ఫ్యాన్స్‌ ఖుష్ అవుతున్నారు. ‘గుడ్డూ భయ్యా మళ్లీ వచ్చేశాడు’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. త్వరలోనే ఈ సీజన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది.  

గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన దీని తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఫస్ట్‌ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇదీ సూపర్‌హిట్‌ అయ్యింది. తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బందిపెట్టాడని చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. దీంతో మూడో దానిపై ఆసక్తి నెలకొంది. ఇందులో విజయవర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని