Mrunal Thakur: ఇక్కడ సినిమాలు చేయకూడదనుకున్నా: మృణాల్‌ ఠాకూర్‌

‘సీతారామం’ సమయంలో తెలుగు రాక ఎంతో ఇబ్బంది పడినట్లు మృణాల్‌ఠాకూర్ అన్నారు. 

Updated : 04 Apr 2024 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫ్యామిలీ స్టార్‌’తో మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు మృణాల్‌ ఠాకూర్‌. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ కుటుంబ కథా చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘సీతారామం’ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తెలుగులో సినిమాలు చేయకూడదనుకున్నట్లు చెప్పారు.

‘భాష రాకపోతే నటించడం చాలా కష్టం. ‘సీతారామం’ సమయంలో తెలుగు రాకపోవడం వల్ల రోజూ ఏడ్చేదాన్ని. అది విడుదలయ్యాక ఆ కష్టాన్నంతా మర్చిపోయా. మహారాణి పాత్రలో నటించాలని నా చిన్నప్పటి కల. అందుకే ఆ సినిమా కోసం చిత్రబృందం సంప్రదించగానే ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పాను. దానికోసం మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని దాన్ని రాత్రంతా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. సీతారామమే నా మొదటి, చివరి తెలుగు సినిమా అని కశ్మీర్‌లో షూటింగ్‌ జరిగేటప్పుడు దుల్కర్‌తో చెప్పాను. ఇక తెలుగులో చేయనన్నాను. ఆయన నవ్వుతూ ఈ చిత్రం తర్వాత నాకు వరుస అవకాశాలొస్తాయన్నారు. అదే నిజమైంది’ అని చెప్పారు.

అదే ఇంటర్వ్యూలో దుస్తుల గురించి మాట్లాడుతూ..  ‘నేను ఈవెంట్ల కోసం వేసుకునే డ్రెస్‌లన్నీ ఫ్యాషన్‌ డిజైనర్లు ఇచ్చేవే. నేను దుస్తుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టను. ఇప్పటి వరకు నేను కొన్నవాటిల్లో ఎక్కువ ఖరీదైన డ్రెస్‌ ధర రూ. 2 వేలు మాత్రమే. ఆ మాత్రం ఖరీదు కల వస్తువును కొనడానికి చాలాసేపు ఆలోచిస్తా. విలాసవంతమైన వాటిని కొని బీరువాలో దాచుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. బ్రాండెడ్‌వి కొనడం వల్ల డబ్బు వృథా అవుతుంది. అందుకే నేను ఇల్లు, భూమిపై పెట్టుబడి పెడతాను. అది ఎప్పటికైనా ఉపయోగం. ట్రెండీగా కనిపించాలనుకోవడంలో తప్పులేదు. దాని కోసం అవసరానికి మించి ఖర్చుచేయకూడదు’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని