GV Prakash: వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్‌, సైంధవి దంపతులు

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ తన వైవాహిక బంధానికి వీడ్కోలు పలికాడు. తన భార్య సైంధవితో వీడిపోతున్నట్లు ప్రకటించాడు. 

Updated : 14 May 2024 09:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ (GV Prakash), ఆయన భార్య, గాయని సైంధవి (Singer Saidhavi) విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వారు పోస్టు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ (AR Rehaman) మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్‌.. 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో వారికి కూతురు పుట్టింది. 

‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్‌ పేర్కొన్నారు. 

తమిళంలో యుగానికి ఒక్కడు, రాజా రాణి, ‘అసురన్’‌, ‘సురరై పోట్రు’( అకాశమే నీ హద్దు) లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు పాటలు అందించిన జీవీ ప్రకాశ్‌.. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, ప్రభాస్‌ చిత్రం ‘డార్లింగ్‌’, ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త, రాజాధిరాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సంగీత దర్శకుడి నుంచి హీరోగా మారిన ఆయన 15 చిత్రాలకు పైనే ప్రధాన ప్రాతల్లో నటించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని