Hesham Abdul Wahab: ఇలాంటి చిత్రం చేయడం నాకిదే తొలిసారి!

‘ఖుషి’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌. ఇప్పుడాయన సంగీత దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘మనమే’.

Published : 05 Jun 2024 01:07 IST

‘ఖుషి’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌. ఇప్పుడాయన సంగీత దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘మనమే’. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ సినిమాని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. కృతిశెట్టి కథానాయిక. ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు హేషమ్‌. 

  • ‘‘హాయ్‌ నాన్న’కు పూర్తి భిన్నమైన చిత్రం ‘మనమే’. అన్ని రకాల భావోద్వేగాలతో నిండి ఉన్న పక్కా వాణిజ్య చిత్రమిది. దీంట్లో సంగీతానికి ఎంతో ధాన్యముంది. ఇందులో మొత్తం 16 పాటలున్నాయి. ఇలాంటి సినిమా చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. నిజానికి ఈ చిత్ర సంగీతం పనులు మొదలు పెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని మేము ఊహించలేదు. కానీ, శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచి మంచి మ్యూజిక్‌ చేసే అవకాశమిచ్చారు. కథ రీత్యా ప్రథమార్ధంలో 10 పాటలు.. ద్వితీయార్ధంలో 6 పాటలు పెట్టాల్సి వచ్చింది. వీటిలో 10పాటలు పూర్తి నిడివితో ఉంటాయి. మిగిలినవి బిట్స్‌ సాంగ్స్‌లా ఉంటాయి’’. 
  • ‘‘శర్వానంద్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అలాగే ఇందులో కృతిశెట్టి నటన కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. విక్రమ్‌ ఆదిత్య పాత్ర సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇవే కాక దీంట్లో మరికొన్ని అందమైన పాత్రలూ ఉన్నాయి. సినిమా పూర్తయ్యాక కూడా వీళ్ల పాత్రలు మీ మదిలో అలా గుర్తుండిపోతాయి. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.   దానికోసం మేము రెండు నెలలు  కష్టపడ్డాం’’. 
  • ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ సంగీతాన్ని ప్రేక్షకులు గొప్పగా వేడుక చేసుకుంటారు. అలాగే ఎంతో గౌరవంగా, ప్రేమగా చూస్తారు. అందుకే హైదరాబాద్‌ను నా రెండో ఇల్లుగా భావిస్తాను. ప్రస్తుతం నేను రష్మిక ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రానికి సంగీతమందిస్తున్నాను. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’.  
  • ‘‘ప్రతి సంగీత దర్శకుడు విభిన్నమైన కథలతో ప్రయాణం చేయాలని అనుకుంటాడు. నా కెరీర్‌ ఆరంభంలోనే అలాంటి చిత్రాలతో నిరూపించుకునే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా సంగీత ప్రతిభ అంతటినీ ‘మనమే’ ద్వారా ప్రేక్షకులకు చూపించుకునే అవకాశం దొరికింది. అందుకే దీనికోసం నా గత చిత్రాల కంటే ఎక్కువ కష్టపడ్డాను. నాకే కాదు శర్వా, శ్రీరామ్, కృతి.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇది ఎంతో ప్రత్యేకమైన చిత్రం. దీనికోసం చిత్ర బృందమంతా ప్రాణం పెట్టి పని చేసింది. దీనిపై మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు