Vignesh Shivan: ఇదే కనుక రిపీటైతే చర్యలు తీసుకుంటా: విఘ్నేశ్‌ శివన్‌పై దర్శకుడి ఆగ్రహం

విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) తెరకెక్కిస్తోన్న కొత్త సినిమా విషయంలో వివాదం నెలకొంది. ఆ టైటిల్‌ను విఘ్నేశ్‌ ఉపయోగించడానికి వీలు లేదని దర్శకుడు కుమారన్‌ అన్నారు.

Published : 16 Dec 2023 14:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఏడాది విరామం తర్వాత మెగాఫోన్‌ పట్టారు నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan). ‘ఎల్‌ఐసీ’ (Love Insurance Corporation) పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan), కృతిశెట్టి (krithi Shetty) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా టైటిల్‌ విషయంలో ప్రస్తుతం కోలీవుడ్‌లో వివాదం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే తాను ‘ఎల్‌ఐసీ’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకున్నానని సంగీత దర్శకుడు, దర్శకుడు ఎస్‌.ఎస్‌.కుమారన్‌ అన్నారు. కాబట్టి ఆ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయన్నారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. లక్ష్మణ పాత్రధారికి అందని ఆహ్వానం..!

‘‘విఘ్నేశ్‌ శివన్‌ తన కొత్త చిత్రానికి ‘ఎల్‌ఐసీ’ అనే పేరు పెట్టారని తెలిసి నేను షాకయ్యా. నా సొంత బ్యానర్‌ సుమ పిక్చర్స్‌పై 2015లోనే ఈ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకున్నా. ఈ విషయం తెలిసి కొన్నిరోజుల క్రితం విఘ్నేశ్‌ మేనేజర్‌ నన్ను సంప్రదించాడు. నేను రాసుకున్న కథకు ఆ టైటిల్‌ పూర్తి న్యాయం చేస్తుందని.. కాబట్టి దానిని వేరే వాళ్లకు ఇవ్వలేనని చెప్పా. నన్ను సంప్రదించిన తర్వాత కూడా అతడు ఇలాంటి చర్యలకు పాల్పడటం అన్యాయం. ఈ టైటిల్‌పై సర్వహక్కులు నాకే ఉన్నాయి. ఏవిధంగానైనా దానిని ఉపయోగించుకునే అర్హత అతడికి లేదు. ఒకవేళ అతడు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని కుమారన్‌ అన్నారు. ‘పూ’ అనే తమిళ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెరంగేట్రం చేశారు కుమారన్‌. ‘తేనీర్‌ విడిది’తో ఆయన దర్శకుడిగా మారారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని