Pushpa2: హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి.. ‘పుష్ప2’ మోత మోగిపోవడమే ఇక..!

Pushpa2 update: అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప2’కు సంబంధించి మ్యూజిక్‌ సెషన్స్‌ జరుగుతున్నాయి.

Published : 05 Apr 2024 00:03 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్’. ‘పుష్ప1’కు కొనసాగింపుగా రాబోతున్న ఈ మూవీ కోసం యావత్‌ భారత సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పని పూర్తి కాగా, దానికి తన నేపథ్య సంగీతంతో డబుల్‌ ఇంపాక్ట్‌ ఇవ్వబోతున్నారు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ ఫొటోను పంచుకుంది. సుకుమార్‌, అల్లు అర్జున్‌, దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి దిగిన ఈ ఫొటోకు ‘హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ టీజర్‌కు సెన్సేషనల్‌ బీజీఎం రాబోతోంది’ అని పేర్కొంది.

‘పుష్ప-1’లో పాటలు ఏ స్థాయిలో హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. సామాన్యుల దగ్గరి నుంచి క్రికెటర్లు వరకూ అందరూ రీల్స్‌తో హోరోత్తించారు. ఇప్పుడు అంతకుమించిన మ్యూజిక్‌ ఆల్బమ్‌ను ఇచ్చేందుకు దేవిశ్రీ సిద్ధమవుతున్నారు. టీజర్‌కు నేపథ్య సంగీతం అందించడంతో పాటు, సినిమాలోని పాటలకు సంబంధించిన ఫైనల్‌ వెర్షన్స్‌ కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా సుకుమార్‌, అల్లు అర్జున్‌ మ్యూజిక్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. సుకుమార్‌, దేవిశ్రీ కాంబోలో ఐటమ్‌ సాంగ్ అదిరిపోవాల్సిందే. ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావ’తో ఓ ఊపు ఊపేశారు. దానికి దీటుగా ఉండేలా దేవిశ్రీ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులోనూ సమంత చిందేస్తారని కొన్నిరోజుల కిందట టాక్‌ వినిపించింది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండటంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.

మే చివరి నాటికి ‘పుష్ప2’ చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అల్లు అర్జున్‌ తన పోర్షన్‌ కంప్లీట్‌ చేసి, తర్వాతి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతారని అంటున్నారు. ‘పుష్ప1’ ప్రమోషన్స్‌ కోసం చివరి నిమిషం వరకూ టీమ్‌ కష్టపడింది. ఈసారి పూర్తి సమయాన్ని ప్రమోషన్స్‌ కేటాయించాలని భావిస్తోంది. అందుకు తగిన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు