Music Shop Murthy: మూర్తి కలల ప్రయాణం

అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు.

Updated : 22 Apr 2024 12:08 IST

జయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు అజయ్‌ భూపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇరవయ్యేళ్ల వయసులో కన్న కలలు, లక్ష్యాల కోసం యాభయ్యేళ్ల మూర్తి చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఆయన డీజే అయ్యాడా లేదా? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందినట్టు టీజర్‌ స్పష్టం చేస్తోంది. టీజర్‌ విడుదల అనంతరం అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు శివ కరోనా సమయంలో ఈ సినిమా నాతోనే చేయాలని మూడేళ్లు తిరిగాడు. నేను ప్రధాన పాత్ర పోషించడం ఏమిటి? నాపై డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? అని అడిగా. కానీ కథ చెప్పాక... సెట్స్‌పైకి వచ్చాక ఈ కథ గొప్పదనం ఏమిటో తెలిసింది. ఇందులో ఓ జీవితం కనిపిస్తుంది. మన జీవితాల్లో మనం ఏమేం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చెబుతుంది.  చాందినీచౌదరి చాలా బాగా నటించారు. భానుచందర్‌, ఆమని, దయానంద్‌ తదితరులతో కలిసి నటించిన అనుభవం చాలా బాగుంది’’ అన్నారు. ‘‘ఈ కథని ముందుగా అజయ్‌ ఘోష్‌కే చెప్పా. నన్ను నమ్మి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. నిర్మాతలు నమ్మడంతోనే ఓ మంచి చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు దర్శకుడు. అజయ్‌ భూపతి మాట్లాడుతూ ‘‘కోట శ్రీనివాసరావు అంతటి స్థాయికి ఎదిగే సత్తా ఉన్న నటుడు అజయ్‌ ఘోష్‌. ఇలాంటి కథని రాసిన, తీసిన దర్శకనిర్మాతల్ని అభినందించాల్సిందే’’ అన్నారు. ప్రేక్షకులందరికీ కనెక్ట్‌ అయ్యే చిత్రమిదన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో నటుడు బాలచందర్‌తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని