Oscars 2023: నాటు నాటు... ఆస్కార్‌ పట్టు

నాటు నాటు (Naatu Naatu) పాట దేశానికి ఆస్కార్‌ తీసుకురావాలని దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ముక్తకంఠంతో  కోరుకుంటున్నారు. ఆస్కార్‌ (Oscars 2023) అనేది సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నం.

Updated : 25 Jan 2023 06:57 IST

నాటు నాటు (Naatu Naatu) పాట దేశానికి ఆస్కార్‌ తీసుకురావాలని దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ముక్తకంఠంతో  కోరుకుంటున్నారు. ఆస్కార్‌ (Oscars 2023) అనేది సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నం. ఆ కల సాకారానికి అతి దగ్గరలో ఉంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రబృందం. ‘నాటు నాటు’ పాటకు మన ప్రేక్షకులే కాదు... విదేశాల్లోనూ ఈ పాట చూస్తూ సీట్లలో నుంచి లేచి ఆడిపాడుతున్నారు.  అంతగా ఊపేసిన ఈ పాట అంతర్జాతీయ పురస్కారాల్లో తొలి నుంచీ ఫేవరేట్‌గా నిలుస్తూ వచ్చింది. ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లను భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం అమెరికాలోని కాలిఫోర్నియాలో అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్ల కిందటే ఆస్కార్‌ పురస్కారాల్లో 15 పాటల తుది జాబితాకి ఎంపికైన ఈ పాట, చివరి ఐదు పాటల్లో ఓ నామినేషన్‌ని కైవశం చేసుకుని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ వుమెన్‌’ చిత్రంలోని అప్లాజ్‌..., ‘టాప్‌ గన్‌: మేవరిక్‌’లో హోల్డ్‌ మై హ్యాండ్‌..., ‘బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫరెవర్‌’ చిత్రంలోని లిఫ్ట్‌ మి అప్‌.., ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రంలోని దిస్‌ ఈజ్‌ఎ లైఫ్‌.. పాటలతో తుది అంకంలో పోటీ పడుతోంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్లని సొంతం చేసుకున్న తొలి భారతీయ గీతం ఇదే. ఇదివరకు ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచిన ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’లోని జై హో... పాటకి ఉత్తమ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ని దక్కించుకున్నారు. కానీ అది భారతీయ నేపథ్యం ఉన్న కథే అయినా, ఆ చిత్రం మాత్రం బ్రిటిష్‌ రూపకర్తల నిర్మాణంలో రూపుదిద్దుకుంది. అందుకే ‘నాటు నాటు...’ ఆస్కార్‌ గెలిస్తే మాత్రం తొలి భారతీయ గీతంగా చరిత్రని సృష్టిస్తుంది. ‘లగాన్‌’ తర్వాత నామినేషన్‌ దక్కించుకున్న భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. ఉత్తమ నటుడుతోపాటు, ఇతర మరికొన్ని విభాగాల్లోనూ నామినేషన్లు దక్కుతాయని ఆశించారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అభిమానులు. కానీ ఆ కల నెరవేరలేదు. అయితే ఆస్కార్‌ 95 పురస్కారాల కోసం రూపొందించిన ప్రోమోలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు చోటు దక్కడం విశేషం.


తొలి భారతీయ డాక్యుమెంటరీ

ర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత నేపథ్యంతో రూపొందిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’ (All That Breathes) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది. దీన్ని శౌనక్‌ సేన్‌ తెరకెక్కించారు. దిల్లీకి చెందిన ప్రకృతి ప్రేమికులైన మహ్మద్‌ సాద్‌, నదీం షెహ్‌జాద్‌ జీవితాల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందింది. గాయపడ్డ పక్షులకు సపర్యలు చేయడం, వాటిని రక్షించడం కోసం ఈ సోదరులిద్దరూ తమ జీవితాన్నే కేటాయించారు. ఈ డాక్యుమెంటరీ గతంలో ప్రఖ్యాత బాఫ్టా అవార్డుకు సైతం నామినేట్‌ అయ్యింది. ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’ అకాడెమీ అవార్డుకి నామినేట్‌ అయిన తొలి భారతీయ డాక్యుమెంటరీ.

* భారతీయ డాక్యుమెంటరీ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్ఫరర్స్‌’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగానికి నామినేట్‌ అయింది. 41 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ఫిల్మ్‌కి కార్తీకి గోంజాల్వ్స్‌ దర్శకత్వం వహించారు. గునీత్‌ మోంగా, అచిన్‌ జైన్‌ నిర్మించారు. ప్రధాన అవార్డు కోసం ఇది మరో పద్నాలుగు డాక్యుమెంటరీలతో పోటీ పడనుంది.


మాకు.. దేశానికీ గర్వకారణం

నాటు నాటు పాటకి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడంతో భారతీయ సినీ, రాజకీయ, ప్రేక్షక వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలువురు ప్రముఖులు సామాజిక అనుసంధాన వేదికల ద్వారా  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందాన్ని అభినందించారు. తమ పాటకి పురస్కారం దక్కిందని తెలియగానే సినీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సినిమాలో కొమురం భీమ్‌గా నటించిన ఎన్టీఆర్‌ (NTR) ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ... ‘‘ఈ పాటకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకస్థానమే. ఆస్కార్‌ నామినేషన్‌ మరో చిరస్మరణీయ ఘనత’’ అంటూ బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఎంత అద్భుతమైన వార్త. నాటు నాటు’ ఆస్కార్‌కి నామినేట్‌ కావడం గౌరవంగా భావిస్తున్నా. మాకు, భారతదేశానికి గర్వకారణమైన క్షణం. సోదరుడు ఎన్టీఆర్‌కి, రాజమౌళికి, కీరవాణి, మొత్తం సినీ బృందానికి నా అభినందనలు’’ అంటూ ట్వీట్‌ చేశారు మరో కథానాయకుడు, అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్‌చరణ్‌. నాటు నాటు పాటకోసం పనిచేసిన వారందరికీ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి (Rajamouli). ఆయన ఈ సందర్భంగా నామినేషన్‌ దక్కించుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభినందించారు.


11 నామినేషన్లతో ‘ఎవ్రీథింగ్‌...’ హవా

95వ అకాడెమీ అవార్డుల నామినేషన్లలో అత్యధికంగా 11 నామినేషన్లతో దుమ్ము రేపింది ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రం. ఆ తర్వాత ‘ఆల్‌ క్వయిట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌’ చిత్రాలు తొమ్మిదేసి నామినేషన్లు దక్కించుకున్నాయి. ఎల్విస్‌ చిత్రానికి ఎనిమిది నామినేషన్లు దక్కాయి. మార్చి 12న ఆస్కార పురస్కారాల వేడుక జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని