Nabha Natesh: ఆ కళే.. నాకు థెరపీలాంటిది!

అందం.. నటనే కాదు.. అలవోకగా చిత్రాలు గీయగల సృజనశీలి నభా నటేశ్‌. తనకు మానసిక ప్రశాంతతనిచ్చేవి ఈ పెయింటింగ్సే అంటోందామె.

Updated : 22 Apr 2024 12:21 IST

అందం.. నటనే కాదు.. అలవోకగా చిత్రాలు గీయగల సృజనశీలి నభా నటేశ్‌. తనకు మానసిక ప్రశాంతతనిచ్చేవి ఈ పెయింటింగ్సే అంటోందామె. ‘చిత్రాలేయడం అంటే కళ మాత్రమే కాదు.. నా దృష్టిలో అది ఇబ్బందుల్లో ఒక సాంత్వన. బాధల నుంచి ఉపశమనం కలిగించే ఓ సాధనం. ఒక్కమాటలో చెప్పాలంటే నాకు అది ఒక థెరపీలాంటిది. నా జీవితంలో నేను చేసే పనుల్లో ఏకాగ్రత పెరగడానికి ఈ కళే తోడ్పడుతోంది. రంగులతో ప్రయోగాలు చేయడాన్ని నేను చాలా ఇష్టపడతా. ఖాళీ క్యాన్వాసును అందమైన వర్ణచిత్రంగా మలచడమంటే నాకెంతో ఇష్టం. అది నాకు అంతులేని సంతోషాన్నిస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నభా. ఈ ఆసక్తి మొదలైన విధానం గురించి వివరిస్తూ.. ‘పెయింటింగ్‌తో అనుబంధం నా చిన్నప్పుడే మొదలైంది. నాకు రకరకాల కళల గురించి నేర్చుకోవాలనే ఉత్సాహం అప్పుడు ఎక్కువగా ఉండేది. రంగుల పెన్సిళ్లు, బ్రష్‌లు, షీట్లు సేకరించి సొంతంగా ప్రయోగాలు చేసేదాన్ని. రానురాను అదే ఇష్టమైన వ్యాపకంగా మారింది. పెయింటింగ్‌లో సృజనాత్మకత, కొత్తదనం కోసం అన్వేషణ, ఏదో చేయాలనే తపన ఇలా ఎన్నో అంశాలు నిగూఢంగా ఉంటాయి’ అంటూ ఆ కళ వెనక ఉన్న కథలు వివరించింది. నభా వేసిన చార్లీ చాప్లిన్‌, బ్యాట్‌మన్‌ లాంటి పెయింటింగ్స్‌ని సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, అభిమానులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే చిత్రంలో నిఖిల్‌కి జోడీగా నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని