Naga Chaitanya: బుజ్జిని నడిపిన నాగచైతన్య

బుజ్జి బుజ్జి బుజ్జి... కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తున్న పేరు ఇది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ప్రభాస్‌ చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు పేరే... బుజ్జి.

Updated : 26 May 2024 08:47 IST

బుజ్జి బుజ్జి బుజ్జి... కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తున్న పేరు ఇది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ప్రభాస్‌ చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు పేరే... బుజ్జి. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ఈ కారుని  ఆవిష్కరించారు. మూడు టైర్లతో... ఆరు టన్నుల బరువున్న ఈ కారు తయారీ వెనక ఎన్నెన్నో ప్రత్యేకతలు. ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతం అని కీర్తిస్తున్నారు నెటిజన్లు, వాహన ప్రేమికులు. సినిమాలో ఈ బుజ్జి కారు పాత్ర కీలకం. ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్రతో కలిసి బుజ్జి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో ఈ కారుని తయారు చేశారు. మాటలు కూడా నేర్చిన ఈ కారుని తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే వాహనాల ప్రేమికుడైన యువ కథానాయకుడు నాగచైతన్య... బుజ్జిని కలిశాడు. కార్‌ రేసింగ్, బైక్‌ రేసింగ్‌ని అమితంగా ఇష్టపడే నాగచైతన్య... బుజ్జి కార్‌నెక్కి షికారు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘బుజ్జిని నడపడం అద్భుతమైన అనుభవం. ‘కల్కి’ బృందం ఇంజినీరింగ్‌ రూల్స్‌ని బ్రేక్‌ చేసింది. నేనింకా షాక్‌లో ఉన్నా’’ అన్నారు. ఎక్స్‌లోనూ ఆయన స్పందిస్తూ... ‘‘విజన్‌ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన చిత్రబృందానికి హ్యాట్సాఫ్‌. బుజ్జితో కలిసి గడిపిన క్షణాలు అద్భుతం. జీవితంలో ఇలాంటి కార్‌ని డ్రైవ్‌ చేస్తానని ఊహించలేదు. ఇదొక ఇంజినీరింగ్‌ మార్వెల్‌. ఊహల్ని నిజం చేసిన మొత్తం బృందానికి అభినందనలు’’ అంటూ రాసుకొచ్చారు. ప్రభాస్‌ కథానాయకుడిగా... వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ‘కల్కి 2898 ఎ.డి’ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని