Naga Chaitanya: వైఫల్యాలు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పరు..: నాగచైతన్య

నాగచైతన్య తొలి వెబ్‌ సిరీస్‌ దూత (Dhootha) డిసెంబర్‌ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ ప్రమోషన్‌ జోరు పెంచింది.

Published : 29 Nov 2023 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలతో అలరిస్తూనే ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు హీరో నాగ చైతన్య (Naga Chaitanya). ఆయన నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ డిసెంబర్‌ 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో టీమ్ ప్రచారం జోరు పెంచింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు నాగచైతన్య ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘దూత’ విశేషాలతో పాటు తన తర్వాత సినిమా ‘తండేల్‌’ (Thandel) గురించి కూడా మాట్లాడారు. అలాగే మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘తండేల్‌’లో నేను చేస్తున్న పాత్ర ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయలేదు. వాస్తవ కథ ఆధారంగా ఇది రూపొందుతోంది. ఈ చిత్రబృందంలో ఉన్నవారంతా నా మనసుకు దగ్గరైన వారే. దీని షూటింగ్‌ డిసెంబర్‌ రెండో వారంలో మొదలుపెట్టనున్నాం. సాయిపల్లవితో కలిసి మరోసారి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన నటి’ అన్నారు.

ఇక తన చిత్రాల పరాజయం గురించి మాట్లాడుతూ..‘వైఫల్యాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఏ పాఠశాలల్లో.. ఏ టీచర్‌ నేర్పని పాఠాలు, తల్లిదండ్రులు, స్నేహితులు కూడా చెప్పని విషయాలు మనకు పరాజయాలు నేర్పుతాయి. ఒక సినిమా మెప్పించలేకపోతే దానికి గల కారణాలను తెలుసుకుంటాను. దానిలో ఉన్న లోపాలను తెలుసుకుని తర్వాత ప్రాజెక్ట్‌కు వాటిని సరిచేసుకుంటాను. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఎవరూ చెప్పలేరు. అది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోయినా నాకు మంచి అనుభవాలను అందించాయి. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సూపర్‌ హిట్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే, ఆ షూటింగ్‌ను నేను ఎంజాయ్‌ చేశాను. అమిర్‌ఖాన్‌తో నేను గడిపిన క్షణాలను జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఆ సినిమా నాకు అంత మంచి జ్ఞాపకాలను ఇచ్చింది’’ అని చెప్పారు. అలాగే తనకు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ అంటే ఎంతో ఇష్టమన్నారు. అందులో సమంత అద్భుతంగా నటించిందని ప్రశంసించారు.

ఇక ‘దూత’ విషయానికొస్తే.. విక్రమ్ కె కుమార్‌ దర్శకత్వంలో నేచురల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా 5 భాషల్లో  8 ఎపిసోడ్‌లలో ఇది అలరించనుంది. నాగచైతన్య నటిస్తోన్న తొలి వెబ్‌ సిరీస్‌ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని