Spy: ఇలాంటి సినిమాలు తీయడం తేలిక కాదు.. నిఖిల్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం: నాగ చైతన్య

ప్రస్తుత పరిస్థితుల్లో స్పై జానర్‌లో సినిమాలు తీయడం అనుకున్నంత సులువు కాదని నాగ చైతన్య అభిప్రాయపడ్డారు. ‘స్పై’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Published : 27 Jun 2023 23:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిఖిల్‌ (Nikhil Siddharth) హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం.. ‘స్పై’ (SPY). ఈ సినిమాతో ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ (Garry BH) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రానా దగ్గుబాటి, ఆర్యన్‌ రాజేశ్‌, అభినవ్‌ గోమటం కీలక పాత్రలు పోషించారు. ఐశ్వర్య మేనన్‌ (Ishwarya Menon), సాన్యా ఠాకూర్‌ (Sanya Thakur) కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి చైతన్య మాట్లాడుతూ.. ‘‘నిఖిల్‌ అంటే నాకు ఇష్టం. ‘హ్యాపీడేస్‌’ నుంచి ‘కార్తికేయ 2’ వరకు అతడి ప్రయాణాన్ని గమనిస్తున్నా. ఆ జర్నీ స్ఫూర్తిదాయకం. ఓటీటీల ద్వారా ప్రేక్షకులు స్పై జానర్‌కి సంబంధించి ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు చూస్తున్నారు. ఈ క్రమంలో వారిని మెప్పించేలా స్పై నేపథ్యంలో కొత్తగా చిత్రాలు తీయడం అనుకున్నంత సులువు కాదు. నిర్మాణ విలువల్లో ‘స్పై’ టీమ్‌ ఎక్కడా తగ్గలేదు. టీజర్‌, ట్రైలర్లు, పాటలు బాగున్నాయి’’ అని అన్నారు. చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ2’ సినిమా విడుదలకు ముందే నన్ను నమ్మి ‘స్పై’లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత రాజశేఖర్‌ రెడ్డికి ధన్యవాదాలు. నాలుగు రోజుల క్రితం ఫైనల్‌ ఔట్‌పుట్‌ని చూశా. అద్భుతంగా ఉంది. డైరెక్టర్‌ని హగ్‌ చేసుకుని థ్యాంక్స్‌ చెప్పా. ఏ సినిమా విషయంలోనూ నేను ఇలా చేయలేదు. ఈ సినిమా విషయంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మేం చూపించబోతున్నాం. ఫలితం గురించి ఆలోచించట్లేదు. మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిఖిల్‌ తెలిపారు. దర్శకుడు గ్యారీ బీహెచ్‌ జీనియస్‌ అని ఐశ్వర్య మేనన్‌ పేర్కొన్నారు. తెలుగులో తనకిదే తొలి చిత్రమని, ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడడం నేర్చుకుంటున్నానని అన్నారు. నాగచైతన్య సినిమాల్లో తనకు ‘లవ్‌స్టోరి’ అంటే ఇష్టమని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు