Balakrishna: మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్‌’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు.

Published : 28 Mar 2024 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను, దర్శకుడు బోయపాటి శ్రీను మాటల మనుషులం కాదని, ఏదైనా చేతల్లోనే చూపిస్తామని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ‘లెజెండ్‌’ (Legend) విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన వేడుకలో ఆయన మాట్లాడారు. ‘సింహా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది (Legend Blockbuster 10 Years Celebration). 2014 మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌, సినిమాలో కీలక పాత్రలు పోషించిన పలువురు నటులు ఈ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకను చూస్తుంటే సినిమా విడుదలకు ముందు సెలబ్రేట్‌ చేసే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా అనిపిస్తోంది. రెండు రోజుల్లో మళ్లీ ఈ చిత్రం మీ ముందుకు రాబోతుంది (మార్చి 30న రీరిలీజ్‌). రికార్డులనేవి ప్రేక్షకులు ఇస్తారు. మంచి ఉద్దేశంతో తీసిన ప్రతి చిత్రాన్ని వారు ఆదరిస్తారు. సినిమా రికార్డులు నాకేమీ కొత్తకాదు. దర్శక, రచయితలు, నా సహ నటులపై నాకు ఎంతో నమ్మకం. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ స్థాయిలో ‘లెజెండ్‌’ ప్రదర్శితమైంది. దక్షిణాదిలో వెయ్యికిపైగా రోజులు (1116) ఆడిన ఏకైక చిత్రమిదే. వినోదంతోపాటు సందేశం కూడా ఉంది కాబట్టే ప్రేక్షకులు అంతగా ఆదరించారు. చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ఇదొకటి. దీంతోపాటు ‘సింహా’, ‘అఖండ’, ‘నేలకొండ భగవంత్‌ కేసరి’ చిత్రాలు నాలో ఇంకా కసి పెంచాయి. నేను వెళ్తున్న రూట్‌ కరెక్ట్‌ అనిపించాయి’’

‘‘లెజెండ్‌’ 2014లో ఎన్నికలకు ముందు విడుదలైంది. దాని ప్రభావం ఎలక్షన్స్‌ రిజల్ట్స్‌లో కనిపించింది. సమాజంలో చోటుచేసుకునే విషయాలను మేం ముందుగానే సినిమాల్లో ప్రస్తావిస్తుంటాం. నేను, బోయపాటి ఏదైనా కొత్త సినిమా ప్రారంభిస్తే మా కాంబినేషన్‌లో తెరకెక్కిన గత చిత్రాల గురించి పట్టించుకోం. త్వరలో రాబోయే మరో చిత్రం విషయంలోనూ అంతే. ‘అఖండ’ రికార్డుల గురించి చర్చించుకోం. మేం మాటల మనుషులం కాదు. ఏదైనా చేసి చూపిస్తాం. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని