Nani: ‘దసరా’ కాంబోలో మరో సినిమా.. ప్రకటించిన నాని

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో మరో సినిమా చేయనున్నారు.

Published : 30 Mar 2024 21:34 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు నాని (Nani) శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నటించిన ‘దసరా’ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అందుకుంది. ఆ సినిమా విడదలై నేటికి ఏడాది పూర్తి కావడంతో నానీ తన 33వ సినిమా అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా శ్రీకాంతే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఎస్‌ఎల్వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. నాని తన 32వ సినిమాను సుజిత్‌ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు ‘బలగం’ సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు దర్శకత్వంలోనూ నాని నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని