Nani:నాకు అదే గొప్ప స్థాయి: నాని

బాక్సాఫీస్‌ లెక్కలు, స్థానాలు, స్థాయిలని అంతా మాట్లాడుతుంటారు. నాకు సంబంధించినంత వరకు శుక్రవారం సినిమా విడుదలైతే ‘నాని సినిమాకి వెళ్లొద్దాంరా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి.

Updated : 19 Dec 2023 09:24 IST

‘‘బాక్సాఫీస్‌ లెక్కలు, స్థానాలు, స్థాయిలని అంతా మాట్లాడుతుంటారు. నాకు సంబంధించినంత వరకు శుక్రవారం సినిమా విడుదలైతే ‘నాని సినిమాకి వెళ్లొద్దాంరా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతా. ఆ స్థాయిని, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అన్నారు కథానాయకుడు నాని. ఆయన.. మృణాల్‌ ఠాకూర్‌ జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, విజేందర్‌రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో బ్లాక్‌   బస్టర్‌ సక్సెస్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘‘2023 నాకు రెండు రకాల విజయాలిచ్చింది. ఒక స్టేడియం అంతా చీర్‌ చేస్తుంటే గెలవడం చూశాను. అలాగే స్టేడియం అంతా నిశ్శబ్దంగా ఉంటే గెలవడం చూశాను. ఈ రెండూ ఈ ఏడాదిలోనే జరిగాయి. ‘హాయ్‌ నాన్న’ లాంటి అందమైన చిత్రంతో ఈ విజయం అందుకోవడం ఇంకా ప్రత్యేకం. ఈ సినిమాని విజయవంతం చేసినందుకు, మీ మనసుల్లో పెట్టుకున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మీకెప్పటికీ రుణపడి ఉంటా. ఇలాంటి మంచి చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అన్నారు. ‘‘శౌర్యువ్‌ కథ చెప్పినప్పుడే ఏడిపించాడు. చాలా భావోద్వేగానికి గురయ్యా. ఈ విజయం నాని మా బ్యానర్‌కు ఇచ్చిన ఎలివేషన్‌. ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం’’ అన్నారు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నాని ఈ కథని నాకోసం.. తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నా. ఆయన వల్లే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, బేబీ కియారా, మోహన్‌ చెరుకూరి, కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు