Kalki: ‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్‌ హీరోలు!.. వైరలవుతోన్న వార్త

‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్‌ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది.

Published : 22 Apr 2024 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) పేరే వినిపిస్తోంది. ఇందులో అమితాబ్‌ పాత్రను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాన్ని విడుదల చేయడం ఒక కారణమైతే ఈ ప్రాజెక్ట్‌లో మరికొందరు యంగ్‌ నటీనటులు భాగం కానున్నారని వస్తోన్న వార్తలు మరో కారణం. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో ఇప్పటికే అగ్ర తారలు భాగమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.

టాలీవుడ్‌ హీరోలు నాని (Nani), విజయ్‌ దేవరకొండ (Vijay deavrakonda) ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటి అన్నాబెన్‌ కూడా ‘కల్కి’లో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇక ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. గతంలో దుల్కర్‌ దీనిగురించి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేనిప్పుడు చెప్పాలనుకోవడం లేదు. ‘కల్కి’ సెట్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటివి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాత్రమే డిజైన్‌ చేయగలడు’ అని చెప్పారు. దీంతో అగ్ర నటీనటులతో పాటు యువతారలు కూడా కనిపించనున్నట్లు తెలియడంతో చిత్రంపై అంచనాలు రెట్టింపవుతున్నాయి.

నాగ్‌అశ్విన్‌ ఇలా పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకోవడం వెనక పెద్ద ప్రణాళికే ఉందని అంటున్నారు. అన్ని ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్‌ ఇవ్వడం కోసం ఇలా తీసుకుంటున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో నాని, విజయ్‌ దేవరకొండ.. తమిళంలో కమల్‌హాసన్‌.. హిందీలో అమితాబ్‌, దిశాపఠాని.. కేరళలో అన్నాబెన్‌, దుల్కర్‌లు సినిమా విశేషాలు ప్రేక్షకులతో పంచుకుంటారని దర్శకుడు ఇలా ఎంపిక చేశారని కామెంట్స్‌ పెడుతున్నారు.

మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా భారతీయతని ప్రతిబింబించేలా సరికొత్త ప్రయత్నాలు సృష్టించారు. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తున్నారు. దీని విడుదలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని