Navdeep: అందుకే రానా పాత్రని బయటపెట్టలేదు!

‘అందరికీ కొత్త అనుభూతిని అందించే ప్రేమకథా చిత్రం ‘లవ్‌మౌళి’. ఇది అందరికీ ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు నటుడు నవదీప్‌.

Published : 07 Jun 2024 00:57 IST

‘‘అందరికీ కొత్త అనుభూతిని అందించే ప్రేమకథా చిత్రం ‘లవ్‌మౌళి’. ఇది అందరికీ ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు నటుడు నవదీప్‌. ఇప్పుడాయన హీరోగా నటించిన ఈ సినిమాని అవనీంద్ర తెరకెక్కించారు. సి స్పేస్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నవదీప్‌. 

  • ‘‘విభిన్నమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ఏ విషయంలోనూ రొటీన్‌గా అనిపించదు. కచ్చితంగా యువతరానికి బాగా కనెక్ట్‌ అవుతుంది. దీంట్లో నేను నిజమైన ప్రేమ గురించి వెతికే పాత్ర పోషిస్తున్నా. నా పాత్ర భిన్నమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఈ సినిమా కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను. కఠిన కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్‌ లుక్‌లోకి వచ్చాను. నా తపనని నా స్నేహితులు అర్థం చేసుకొని దీన్ని నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ చిత్ర విజయంతో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ సరికొత్తగా మొదలవుతుందని నమ్ముతున్నా’’. 
  • ‘‘రానా ఈ సినిమాలో అఘోరాగా ఒక ముఖ్య పాత్ర పోషించారు. నిజానికి ఆయనకు ఈ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. నాతో ఉన్న స్నేహంతో.. నాకేదైనా చేయాలనిపించి తనీ పాత్ర చేశాడు. దాన్ని నాకు కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈరోజు వరకు కూడా రానా ఈ సినిమా చేశాడని బయట పెట్టలేదు. ఈ చిత్రంలో ఆయన ఆ పాత్ర చేయకుంటే మా దర్శకుడు దాన్ని చేసేవారు. ఏదేమైనా రానా పాత్ర కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తను తెరపై కనిపించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది’’. 
  • ‘‘ఈ చిత్రం కోసం మా చిత్ర బృందమంతా చాలా కష్టపడింది. దీని చిత్రీకరణ మొత్తం మేఘాలయలోని చిరపుంజీలో జరిగింది. నిత్యం వర్షం పడుతూ ఉండే అలాంటి ప్రదేశంలో షూటింగ్‌ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఎన్నో వ్యయప్రయాసలతో ఎక్కడా రాజీ పడకుండా దీన్ని పూర్తి చేశాం. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొత్తగా పెళ్లైన వాళ్లకు.. ప్రేమలో ఉన్న అబ్బాయిలకు, బ్రేకప్‌ అయిన కుర్రాళ్లకు దీంట్లోని అంశాలు ఎక్కడోక చోట తగులుతుంటాయి’’. 
  • ‘‘నా నిజ జీవితంలో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. 23ఏళ్ల నుంచి రకరకాల మనుషుల్ని ప్రేమించాను. అందుకే వ్యక్తిగతంగా ఈ చిత్ర కథ నాకెంతో కనెక్ట్‌ అయ్యింది. దర్శకుడు అవనీంద్ర వ్యక్తిగత అనుభవాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. నేనేప్పుడూ నన్ను నన్నుగా ఉండనిచ్చే అమ్మాయి జీవితంలోకి రావాలనుకుంటా. ప్రస్తుతానికైతే ‘న్యూసెన్స్‌ 2’ వెబ్‌సిరీస్‌ చేస్తున్నా. తమిళంలో నిత్యామేనన్‌తో ఒక సినిమా చేస్తున్నా.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని