Nayattu ott: తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 23 Apr 2024 13:07 IST

హైదరాబాద్‌: మలయాళ ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘నాయట్టు’ (Nayattu). కుంచకో బోబన్‌, జోజూ జార్జ్‌, నిమేషా సజయన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మార్టిన్‌ రూపొందించారు. 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోనూ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, తెలుగు ఆడియో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది మూవీ లవర్స్‌ నిరాశకు గురయ్యారు. ఇప్పుడు తెలుగు వారిని అలరించేందుకు ‘చుండూరు పోలీస్‌స్టేషన్‌’ (Chunduru Police Station) పేరుతో రాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే మూవీని తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్‌’ రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

కథేంటంటే: కేరళలో ఎన్నికల సమయం అది. ప్రవీణ్‌ మైఖేల్‌ (బోబన్‌) అప్పుడే పోలీసు స్టేషన్‌లో విధుల్లో చేరతాడు. ఏఎస్‌ఐగా మణియన్‌ (జోజు జార్జ్‌), కానిస్టేబుల్‌ సునీత అక్కడే పనిచేస్తుంటారు. ఓ సామాజిక వర్గానికి చెందిన యువనాయకుడితో ప్రవీణ్, మణియన్‌లు వాగ్వాదానికి దిగుతారు. ఓ రోజు ఫంక్షన్‌కి ముగ్గురు వెళ్లొస్తుంటారు. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యాక్సిడెంట్‌ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోతాడు. అతడు ఎవరో కాదు.. పోలీసు స్టేషన్‌లో గొడవకు దిగిన వ్యక్తికి దగ్గరి బంధువు. ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఏ సంబంధమూ లేని వీరి ముగ్గురిని ఉచ్చులో పడేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలుసుకున్న మణియన్‌ మిగతా ఇద్దరితో కలిసి పోలీసు స్టేషన్‌ నుంచి పరారవుతాడు. దీంతో వేట మొదలవుతుంది. సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వీరిని వెంటాడుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి వీరు ముగ్గురు ఆ కేసులోంచి బయటపడ్డారా? పోలీసులకు చిక్కారా లేదా? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని