Hi Nanna: భావోద్వేగాలు మొద్దుబారుతున్న ఈ తరుణంలో ఇలాంటి సినిమాలే రావాలి!

హాయ్‌ నాన్న లాంటి కథ చేయడం ఒక పెద్ద సవాల్‌. ఇది చాలా సున్నితమైన కథ. దాన్ని మాటలతో, భావోద్వేగభరిత సన్నివేశాలతో నిలబెడుతూ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్‌ అనుభూతి అందివ్వాలి.

Updated : 03 Dec 2023 06:53 IST

హాయ్‌ నాన్న లాంటి కథ చేయడం ఒక పెద్ద సవాల్‌. ఇది చాలా సున్నితమైన కథ. దాన్ని మాటలతో, భావోద్వేగభరిత సన్నివేశాలతో నిలబెడుతూ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్‌ అనుభూతి అందివ్వాలి. అందుకే ఇలాంటి కథ రాయడం.. తీయడం రెండూ సవాలే అన్నారు శౌర్యువ్‌. ఆయనకు హాయ్‌ నాన్న్ఠ దర్శకుడిగా తొలి చిత్రం. నాని కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని మోహన్‌ చెరుకూరి, విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్లతో ముచ్చటించారు శౌర్యువ్‌.

దర్శకుడిగా మీకిది తొలి సినిమా. దీనికోసం ప్రేమ కథనే ఎంచుకోవడానికి కారణమేంటి?

దర్శకత్వం తొందరగా వస్తుందని ఈ ప్రయత్నం చేశా. నిజానికి నేను కొన్ని యాక్షన్‌ కథలు కూడా రాసుకున్నా. కానీ, తొలి చిత్ర దర్శకుడికి ప్రేమకథ అయితే అందరూ నమ్ముతారని విశ్వాసం. హాయ్‌ నాన్న మామూలు ప్రేమకథ కన్నా ఎమోషన్స్‌ హై పిచ్‌లో ఉండే కథ. అయితే అందరికీ ప్రేమకథలే వర్కవుటవుతాయని చెప్పలేం. శ్రీకాంత్‌ ఓదెల తన తొలి చిత్రం దసరాని పూర్తి కమర్షియల్‌ సినిమాగా అద్భుతంగా చేశాడు.

నాని కథ ఓకే చేశారంటే దాంట్లో చాలా బలం ఉండాలి. మీ కథలో బలం ఏమిటని భావిస్తున్నారు?

నా ప్రధాన బలం భావోద్వేగాలే. తండ్రీ కూతురు మధ్య ఉన్న అనుబంధం, వీళ్లకు మృణాల్‌ పాత్రతో ఉన్న బంధం. అలాగే ఈ కథ ప్రధానంగా దేనిపై ఆధారపడి నడుస్తుందన్నవి ఈ స్క్రిప్ట్‌లో ఆసక్తిరేకెత్తించే అంశాలు. ఈ ఎమోషన్స్‌ కారణంగానే నాని ఈ కథను ఒప్పుకున్నారని భావిస్తున్నా. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏం చూపించనున్నాం, వాళ్లు ఎలాంటి ఎమోషన్స్‌ చూడనున్నారన్నది ట్రైలర్‌తోనే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాం.

ట్రైలర్‌ చూస్తుంటే హాయ్‌ నాన్నలో సంతోషం సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. దీనికి ఏదైనా స్ఫూర్తి ఉందా?

లేదండి. సింగిల్‌ ఫాదర్‌ మళ్లీ ప్రేమలో పడ్డారని అనగానే సంతోషం, కుచ్‌ కుచ్‌ హోతా హై లాంటి సినిమాలన్నీ గుర్తొచ్చేస్తాయి. కానీ, హాయ్‌ నాన్న వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇదొక ఫిక్షనల్‌ కథ. అయితే పూర్తిగా ఫిక్షన్‌ అని కూడా చెప్పలేం. ఎందుకంటే జీవితంలో, సమాజంలో పరిశీలించిన చాలా అంశాలు ఇందులో ఉంటాయి. నాని దీంట్లో విరాజ్‌ అనే సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు. అతని కొన్నేళ్ల జీవన ప్రయాణమే ఈ చిత్రం. ఈ చిత్రానికి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు హేషమ్‌. సినిమా చివరికి వెళ్లే సరికి విరాజ్‌ అనే పాత్ర మీకు తెలియకుండానే చాలా విభిన్నంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అవి థియేటర్లో అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి.

ఇప్పుడంతా యాక్షన్‌, వైలెన్స్‌, బోల్డ్‌ సినిమాల హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో హాయ్‌ నాన్న లాంటి చిత్రంతో రావడం ఎలా అనిపిస్తోంది?

పైన చెప్పిన కారణాల వల్లే హాయ్‌ నాన్న లాంటి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ చేశా. మనం చెప్పాల్సిన బలమైన ఎమోషన్‌ ఇదే. దీంట్లో ద్వంద్వార్థ సంభాషణలు లేవు, హింస లేదు. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగే సినిమా ఇది. భావోద్వేగాలు మొద్దుబారుతున్న ఈ తరుణంలో ఇలాంటి చిత్రాలే రావాలి.

ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, శ్రుతిహాసన్‌ల పాత్రలు ఎలా ఉంటాయి?

ఈ కథ రాసుకున్నప్పుడే ఇందులో నాయికగా మృణాల్‌ను అనుకున్నా. తను నటించిన తుపాన్‌ చిత్రం చూశా. అందులో ఆమె నటన చాలా నచ్చింది. హాయ్‌ నాన్నలో కథానాయిక పాత్రలో చాలా కోణాలుంటాయి. అలాగే ఇందులో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలా ఏడిస్తే కూడా ఎవరు అందంగా కనిపిస్తారని ఆలోచిస్తున్నప్పుడు నాకు మృణాల్‌ కనిపించింది. దీంట్లో శ్రుతిహాసన్‌ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆమె పాత్ర గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను.

మీ నేపథ్యమేంటి? భవిష్యత్తులో ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు?

మాది వైజాగ్‌. నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఇంట్లోవాళ్లు మెడిసిన్‌ చేయమంటే.. వాళ్ల కోరిక నెరవేర్చి, సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చా. జాగ్వార్, అర్జున్‌ రెడ్డి, తమిళ రీమేక్‌ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశా. దర్శకుడిగా నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రాజమౌళి. నా బలం ఎమోషన్‌. ఎంత పెద్ద కమర్షియల్‌ సినిమాలోనైనా ఎమోషనే కీలకమని నమ్ముతా. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధం చేసి పెట్టుకున్నా. ఈ చిత్రం విడుదలయ్యాక తదుపరి సినిమా గురించి ఆలోచిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని