Cinema News: సూర్య 44వ చిత్రం ఖరారు

ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్‌ సుబ్బరాజ్‌  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది.

Updated : 29 Mar 2024 11:56 IST

ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్‌ సుబ్బరాజ్‌  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. ప్రేమ, హాస్యం, యాక్షన్‌  మేళవింపుతో ఈ చిత్రం రూపొందనున్నట్టు ఈ సినిమా ప్రకటన స్పష్టం చేస్తోంది. సూర్య త్వరలోనే ‘కంగువ’తో సందడి చేయనున్నారు. తన 43వ సినిమాని సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్న సూర్య... 44వ సినిమా కోసమే కార్తీక్‌ సుబ్బరాజ్‌తో జట్టు కట్టారు.


మెరిసే రంగీలా.. అమర్‌ సింగ్‌ చమ్కీలా

పేదరికం నుంచి వచ్చిన కళాకారుడు..పంజాబీ ప్రజల గాయకుడు...అమర్‌ సింగ్‌ చమ్కీలా జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’. పంజాబ్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన పాటల్లో ఈయనవే ఎక్కువ. టైటిల్‌ పాత్రలో దిల్జీత్‌ దోసాంజ్‌ నటించగా, ఆయన భార్య అమర్‌జ్యోత్‌ కౌర్‌గా పరిణీతి చోప్రా కనిపించనుంది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘ప్రకాశవంతంగా మెరిసే రంగీలా..అతడే మన అమర్‌ సింగ్‌ చమ్కీలా..’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. వస్త్రాల అల్లికల ఫ్యాక్టరీలో పనిచేసే చమ్కీలా గాయకుడిగా ఎలా అయ్యాడో ట్రైలర్‌లో చూపించారు. ఎ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 12న ఓటీటీలో విడుదల కానుంది.


ఫైటర్‌ రాజా పరిష్కారం

రామ్జ్‌, మాయా కృష్ణన్‌ జంటగా కృష్ణ ప్రసాద్‌ వత్యం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫైటర్‌ రాజా’. దినేష్‌ యాదవ్‌, పుష్పక్‌ జైన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, రోషన్‌, శివనందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో విష్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ‘‘ప్రేమ, డబ్బు, కుటుంబం... ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఫైటర్‌ రాజా. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం’’ అన్నారు హీరో రామ్జ్‌. ఈ కార్యక్రమంలో వేణు యెల్దండి, దినేష్‌, మాయా తదితరులు పాల్గొన్నారు.


అమ్మాయి.. నీ దారెటువైపో

గోదారి అటువైపో... నా దారి ఇటువైపో... అమ్మాయి నీ దారెటువైపో... అంటూ తను మనసిచ్చిన అమ్మాయి అన్వేషణలో ఉన్నాడు ఆ అబ్బాయి. మరి ఆమె జాడ తెలిసిందో లేదో తెలియాలంటే  ‘శశివదనే’ చూడాల్సిందే. రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రమిది. సాయిమోహన్‌ ఉబ్బర దర్శకత్వం వహించారు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘గోదారి అటువైపో...’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందిస్తూ ఈ పాటని పాడారు. కిట్టు విస్సాప్రగడ రచించారు. ఇందులోని పాటలకు మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి.


మత్స్యకారుల జీవితాల్ని ప్రతిబింబించే చిత్రమిది

మాకాంత్‌, అవంతిక, భానుశ్రీ నాయకానాయికలుగా నగేష్‌ నారదాసి తెరకెక్కించిన చిత్రం ‘సముద్రుడు’. బదావత్‌ కిషన్‌ నిర్మించారు. సుమన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్‌ మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల జీవితాల్ని ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది.  వారు సాగించే జీవన పోరాటం, వారు పడే మనోవేదనే ఈ చిత్రం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు.


డబ్బు కోసం సినిమల్లోకి రాలేదు

‘‘మంచి సందేశంతో నిండి ఉన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కలియుగం పట్టణంలో’’ అంటోంది ఆయుషి పటేల్‌. ఆమె.. విశ్వ కార్తికేయ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించారు. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర్‌ రెడ్డి, కాటం రమేష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం ఆయుషి. హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. అందులో చాలా కోణాలుంటాయి. దర్శకుడు రమాకాంత్‌ కథ ఎంత బాగా చెప్పారో.. అంత కంటే చక్కగా తెరకెక్కించారు. ఆర్‌ఆర్‌ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది. నేను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికే మూడు సినిమాల్లో అవకాశాలొచ్చాయి’’ అని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని