Cinema News: అయ్యో భామ..

సుహాస్‌ కథానాయకుడిగా... రామ్‌ గోదాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్‌ కథానాయిక. హరీష్‌ నల్లా, ప్రదీప్‌ తాళ్లపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 31 Mar 2024 13:49 IST

సుహాస్‌ కథానాయకుడిగా... రామ్‌ గోదాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్‌ కథానాయిక. హరీష్‌ నల్లా, ప్రదీప్‌ తాళ్లపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌నిచ్చారు. దర్శకులు వశిష్ఠ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శైలేశ్‌ కొలను స్క్రిప్ట్‌ని అందజేశారు.


అనాథ బాలిక కథ మెర్సీ కిల్లింగ్‌

సాయికుమార్‌, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మెర్సీ కిల్లింగ్‌’. సూరపల్లి వెంకటరమణ దర్శకుడు. సిద్ధార్థ్‌ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు. ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని  నిర్వహించారు. సాయికుమార్‌, కోన వెంకట్‌, పూరి ఆకాష్‌, యాంకర్‌ రవి హాజరయ్యారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్వేచ్ఛ అనే అనాథ బాలిక చుట్టూ కథ సాగుతుంద’’ని దర్శకుడు వెంకటరమణ.ఎస్‌ తెలిపారు.


పరిశోధన చేసి తీసిన సినిమా

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు విరించి వర్మ. ఇప్పుడాయన నుంచి రానున్న కొత్త చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. రాకేష్‌ వర్రే, రియా సుమన్‌ జంటగా నటించారు. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమాని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.. ‘‘1980లలో జగిత్యాలలో జరిగిన వాస్తవ కథతో చక్కటి యాక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కించాం. దీనికోసం మేము చాలా పరిశోధన చేసి ఎంతో నిజాయతీగా రూపొందించాం’’ అన్నారు.


రా.. లవ్‌ మీ!

‘‘ప్రతిసారీ కొత్త కథలు దొరకవు. కొన్నిసార్లు పాత కథలతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ మేం ఓ కొత్త కథతో ‘లవ్‌ మీ’ చేశాం. తర్వాత సన్నివేశం ఏమిటో ఊహించలేని విధంగా ఉంటుంది’’ అన్నారు దిల్‌రాజు. ఆయన సంస్థ దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్‌ మీ’. ఇఫ్‌ యు డేర్‌... అనేది ఉపశీర్షిక. ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. వచ్చే నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘రావాలి రా...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనలోని ఈ గీతాన్ని చంద్రబోస్‌ రచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని