Cinema News: ‘మైదాన్‌’లో ఒక్కరిగా..

‘మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌.

Updated : 01 Apr 2024 12:07 IST

‘మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా నటిస్తున్న చిత్రమే ‘మైదాన్‌’. అజయ్‌, ప్రియమణి జంటగా అమిత్‌ శర్మ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న రానున్న సందర్భంగా అజయ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోని పంచుకున్నారు. ‘పదకొండు మంది ఆటగాళ్లు పదకొండు రోజుల్లో ‘మైదాన్‌’లో దిగనున్నారు. ఫుట్‌బాల్‌తో భారత చరిత్రను మార్చిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ అసలు కథ చూడండి!’ అనే వ్యాఖ్యల్ని జోడించారు.


మిస్టరీ హత్యల ‘అరణ్మనై 4’

‘మానవ శక్తులు ఆ దుష్టశక్తిని నియంత్రించలేవు. దైవశక్తి మాత్రమే దాన్నుంచి మనల్ని రక్షించగలదు’ అంటూ వచ్చిన ‘అరణ్మనై 4’ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సుందర్‌.సి ప్రధాన పాత్రధారిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, రాశీఖన్నా ముఖ్యభూమికలు పోషించారు. అతీంద్రియశక్తుల కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. తమన్నా ఆత్మహత్య చేసుకోవడం.. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ శక్తిమంతమైన దుష్టశక్తిగా తిరిగి రావడం.. తర్వాత భవనంలో హత్యలు జరగడం లాంటి సంఘటనలతో ట్రైలర్‌ ఆసక్తిని పెంచుతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అసలు ఆ రాజ భవనంలో జరుగుతున్న హత్యల వెనకున్న కారణం ఏంటో తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.


పిలగా.. జర పైలం!

సాయితేజ, పావని కరణం జంటగా ఆనంద్‌ గుర్రం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. రామకృష్ణ బొద్దుల, ఎస్‌.కె.శ్రీనివాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రం శ్రీను, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సంగీత దర్శకుడు, గాయకుడు రామ్‌ మిరియాల ఇటీవల విడుదల చేశారు. ‘‘అంబానీలా లక్షల కోట్లు సంపాదించాలని అత్యుత్సాహంతో కలలు కన్న ఓ మధ్యతరగతి కుర్రాడి కథ ఇది. పద్మవ్యూహంలాంటి మన బ్యూరోక్రసీ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఆ కుర్రాడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది దీంట్లో వినోదాత్మకంగా చూపించనున్నాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.


అర్జున్‌ ఉస్తారాగా..

నిన్నటిదాకా లవర్‌బాయ్‌గా ప్రేమకథలతో అలరించిన కార్తిక్‌ ఆర్యన్‌.. ఒక్కసారిగా గేరు మార్చి యాక్షన్‌ బాట పట్టాడు. బాక్సర్‌గా పోరాటాలు చేస్తున్న ‘చందు ఛాంపియన్‌’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉండగా.. మరో యాక్షన్‌ థ్రిల్లర్‌కి పచ్చజెండా ఊపాడు. విశాల్‌ భరద్వాజ్‌ తెరకెక్కించే ఈ చిత్రానికి ‘అర్జున్‌ ఉస్తారా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాత. భావోద్వేగాలతో కూడిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ దీపావళికి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణను విదేశాల్లో జరిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తను నటిస్తున్న ‘భూల్‌ భులయ్యా 3’ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని