Cinema News: భాస్కర్‌ ఎందుకంత లక్కీ?

ఒక సాధారణ బ్యాంక్‌ ఉద్యోగి ఖాతాలో రూ.కోట్లకు కోట్లు డబ్బు. అంత డబ్బు ఎలా సంపాదించాడో తెలియాలంటే ‘లక్కీ భాస్కర్‌’ చూడాల్సిందే.

Updated : 12 Apr 2024 12:35 IST

క సాధారణ బ్యాంక్‌ ఉద్యోగి ఖాతాలో రూ.కోట్లకు కోట్లు డబ్బు. అంత డబ్బు ఎలా సంపాదించాడో తెలియాలంటే ‘లక్కీ భాస్కర్‌’ చూడాల్సిందే. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా... వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రంజాన్‌ సందర్భంగా గురువారం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఖర్చు పెట్టేస్తాం’’ అంటూ మధ్య తరగతి మనస్తత్వం గురించి కథానాయకుడు చెప్పిన సంభాషణ టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. దుల్కర్‌ సల్మాన్‌ ఇందులో బ్యాంక్‌ క్యాషియర్‌ పాత్రలో నటిస్తున్నారు. జులైలో తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, కూర్పు: నవీన్‌ నూలి, కళ: బంగ్లాన్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి.


భక్తురాలికి క్షేత్ర పాలకుడి రక్ష

మంచు లక్ష్మి, శివ కంఠంనేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్‌ కుమార్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌.ఎస్‌.కె నిర్మాత. ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరోన్హా, శ్రీజిత ఘోష్‌, వెంకట్‌ కిరణ్‌ ఇతర పాత్రలు పోషించారు. మాధవ్‌ సైటా, సంజీవ్‌ మేగోటి, బి.సుల్తాన్‌ వలి, ఓపెన్‌ బనానా, లుబెక్‌ లీ మార్విన్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఆర్‌.పి.పట్నాయక్‌, ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై పాటల్ని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘1974 నుంచి 1992 మధ్య జరిగే పిరియాడిక్‌ డ్రామా ఇది. భక్తురాలిని దుష్ట శక్తుల నుంచి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ ఇది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం మంచు లక్ష్మి. ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. పాటలు చిత్రానికి ప్రధానబలం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చీర్ల శ్రీనివాసయాదవ్‌, జనసేన నాయకుడు యనమల భాస్కరరావు, డ్యాన్స్‌ మాస్టర్‌ సన్‌ రేస్‌, వి.ఉదయ్‌ శంకర్‌, భారతిబాబు, ఊటుకూరు రంగారావు, సమ్మెట గాంధీ తదితరులు పాల్గొన్నారు.


ఫులే జీవితం ఓ విప్లవం

జీవిత కథలను తెరపైకి తీసుకురావడం ఒక సవాలు. అలాంటి సవాళ్లను బాధ్యతగా స్వీకరిస్తూ..కీలక పాత్రల్ని పోషిస్తాడు బాలీవుడ్‌ కథానాయకుడు ప్రతీక్‌ గాంధీ. మహాత్మ జ్యోతిబా ఫులే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ‘ఫులే’. టైటిల్‌ పాత్రలో ప్రతీక్‌ గాంధీ నటించనున్నారు. సావిత్రి బాయి ఫులేగా పత్రలేఖ కనిపించనుంది. అనంత్‌ మహదేవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం మహాత్మ జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘చిత్రపరిశ్రమకు ఓ విప్లవం. మన తరానికి ఓ వారసత్వం. ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన చలన చిత్రం ‘ఫులే’’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ‘ప్రేక్షకుల ఎదురుచూపులకు తెర దించుతూ కొత్త పోస్టర్‌ని ఆవిష్కరించడం స్ఫూర్తిదాయకం. సమాజ భవిష్యత్తును రూపొందించడంలో అవిశ్రాంతంగా కృషి చేసిన ఇద్దరి వ్యక్తుల జీవితాలను తెరకెక్కించడం గర్వకారణం’ అంటూ చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.


ప్రదీప్‌ కొత్త చిత్రం ఖరారు

‘లవ్‌ టుడే’తో అందరి దృష్టిని ఆకర్షించాడు తమిళ యువ కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథన్‌. ప్రస్తుతం విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో ‘ఎల్‌ఐసీ’ సినిమాలో నటిస్తున్న ప్రదీప్‌ తాజాగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ‘కలలు కనే వారందరికీ ఈ సినిమా అంకితం’ అంటూ వ్యాఖ్యల్ని జోడించాడు. ఈ చిత్రాన్ని అశ్వంత్‌ మరిముత్తు తెరకెక్కించనున్నారు. నిజమైన సంఘటన ఆధారంగా..అనే వ్యాఖ్యతో, క్లాస్‌రూమ్‌లో జరిగే కహానీలతో వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.


స్వచ్ఛమైన ప్రేమకథలో వామిక

‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్‌ భామ వామికా గబ్బీ. భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మురిపిస్తున్న ఈ భామ..ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె, బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌ ఓ రొమాంటిక్‌ కామెడీ డ్రామాలో జంటగా నటిస్తున్నట్లు సమాచారం. కరణ్‌ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న స్వచ్ఛమైన ప్రేమకథగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మడాక్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘బేబీ జాన్‌’ చిత్రీకరణలో ఉంది వామిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు