విధిని తిరగరాసే ఫరీదాన్‌

‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్‌ బృందం.

Updated : 22 Apr 2024 12:09 IST

హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్‌ బృందం. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరీ, సంజీదా షేక్‌, షెర్మిన్‌ సెహ్‌గల్‌, రిచా చద్ధా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చేస్తున్న మ్యాజికల్‌ సిరీస్‌ ఇది. తాజాగా ఇందులో ఫరీదాన్‌గా కనిపించే సోనాక్షి పాత్రను పరిచయం చేస్తూ.. వీడియోను పంచుకున్నారు. ‘నిప్పులు కురిసే హీరామండీలో తన విధిని తిరగరాసేందుకు మళ్లీ వస్తుందీ ఫరీదాన్‌. మరి తన పనిలో ఆమె విజయం సాధిస్తుందా?’ అంటూ రాసుకొచ్చారు. ‘మిరుమిట్లు గొలిపే ఈ కాంతులు.. ఎన్నో చీకటి రహస్యాలను చూశాయి. ఆ సంఘటనల్ని ఈ ఫరీదాన్‌ ఇప్పటికీ మర్చిపోలేదు. జరిగిన ప్రతి దానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చాను’ అనే వ్యాఖ్యలతో ఉన్న ఈ వీడియో.. ఉత్సుకతని పెంచుతోంది. మే 1న సిరీస్‌ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.


కదిలించే ప్రేమకథతో..

టీవలే విడుదలైన ‘యే వతన్‌ మేరే వతన్‌’లో స్వాతంత్య్ర సమరయోధురాలిగా మెప్పించే నటన ప్రదర్శించింది బాలీవుడ్‌ నాయిక సారా అలీఖాన్‌. ఇప్పుడామె మరో కొత్త కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె, ఆదిత్యరాయ్‌ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మెట్రో ఇన్‌ దినో’. అనురాగ్‌ బసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరులో విడుదల కానున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది సారా. ‘‘భావోద్వేగాలు, నమ్మకం ఇవన్నీ మేళవించి ఉన్న ఆధునిక జంటల హృదయాన్ని కదిలించే ప్రేమ కథను, అది చేసే మాయాజాలాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ‘మెట్రో ఇన్‌ దినో’ నవంబరు 29న మీ ముందుకు రాబోతుంద’ని వ్యాఖ్యల్ని జోడించింది. కొంకణాసేన్‌ శర్మ, ఫాతిమా సనా షేక్‌, అనుపమ్‌ ఖేర్‌, పంకజ్‌ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


‘నింద’ ఎవరిపై..?

రుణ్‌సందేశ్‌ కథానాయకుడిగా, రాజేశ్‌ జగన్నాథం దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘కాన్సెప్ట్‌ ప్రధానంగా రూపొందిన చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది కూడా ఆ తరహా చిత్రమే. నింద ఎలా, ఎవరిపై పడింది? దాని పర్యవసనాలేమిటనే విషయాల్ని తెరపైనే చూడాలి. పరిశ్రమలోని చాలామంది ప్రముఖులకి ఈ సినిమాని చూపించాం. వాళ్లంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని తెలిపాయి సినీవర్గాలు. ఛత్రపతి శేఖర్‌, మైమ్‌ మధు, సిద్ధార్థ్‌ గొల్లపూడి, అరుణ్‌ దలై తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్‌, ఛాయాగ్రహణం: రమీజ్‌ నవీత్‌, కూర్పు: అనిల్‌ కుమార్‌.


విక్రమ్‌ సినిమా కోసం

విక్రమ్‌ కథానాయకుడిగా ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘వీర ధీర శూరన్‌’ తెరకెక్కనుంది. రియా శిబు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్దికీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. సిద్దికీ తెలుగులో ‘అంతిమతీర్పు’, ‘నా బంగారు తల్లి’, ‘అగ్నినక్షత్రం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘వీర ధీర శూరన్‌’ సినిమాని ప్రకటించారు. ఇందులో కాళి అనే పాత్రలో కనిపించనున్నారు కథానాయకుడు. ఎస్‌.జె.సూర్య, విజయన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.


తిరువీర్‌ కల్యాణం

యువ కథానాయకుడు తిరువీర్‌ ఓ ఇంటివారయ్యారు. ఆయన వివాహం కల్పనారావుతో ఆదివారం తిరుమలలో జరిగింది. ‘పలాస’, ‘మసూద’ తదితర చిత్రాలతో మెప్పించిన కథానాయకుడు తిరువీర్‌. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ కొత్త జంట ఒక్కటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని