Tollywood: పాటలే... ప్రచార అస్త్రాలు

చిత్రసీమలో కొత్త చిత్రాలు ప్రచార మెరుపులతో తళుక్కుమంటున్నాయి. విడుదలకు ముందే సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు పాటల్ని అస్త్రాలుగా మలచుకొని సినీప్రియుల మదికి గురిపెడుతున్నాయి.

Updated : 17 Sep 2023 14:00 IST

చిత్రసీమలో కొత్త చిత్రాలు ప్రచార మెరుపులతో తళుక్కుమంటున్నాయి. విడుదలకు ముందే సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు పాటల్ని అస్త్రాలుగా మలచుకొని సినీప్రియుల మదికి గురిపెడుతున్నాయి. ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. శనివారం ఈ జోరు రెట్టింపు స్థాయిలో కనిపించింది. నాని, సుధీర్‌బాబు తదితరులు తమ కొత్త చిత్రాల పాటలు వినిపించారు. రామ్‌ ‘స్కంద’ నుంచి ‘‘కల్ట్‌ మామా’’ గీతంతో అలరించనున్నట్లు కొత్త కబురు అందించారు.


‘స్కంద’.. మామా

రామ్‌ పోతినేని కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’. ది ఎటాకర్‌.. అన్నది ఉపశీర్షిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. సయీ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌, గౌతమి, ప్రిన్స్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే పాటలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఈ నెల 18న ‘‘కల్ట్‌ మామా’’ అనే పాటను విడుదల చేయనున్నారు. రామ్‌ - ఊర్వశీ రౌతేలాపై చిత్రీకరించిన ప్రత్యేక పాటిది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రంలో రామ్‌ రగ్గడ్‌ లుక్‌లో ఊర మాస్‌ అన్నట్లుగా కనిపించగా.. ఊర్వశీ రౌతేలా ఆయన ముందు రొమాంటిక్‌గా స్టెప్పేస్తూ కనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రంలో రామ్‌ రెండు భిన్నమైన గెటప్పుల్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.


భలే సాయం చేశావమ్మా.. సమయమా!

‘‘సమయమా.. భలే సాయం చేశావమ్మో ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా’’ అంటూ ప్రేమ గీతం ఆలపిస్తున్నారు కథానాయకుడు నాని. ఇప్పుడాయన.. మృణాల్‌ ఠాకూర్‌ జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, విజేందర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘సమయమా..’’ అంటూ సాగే ఈ పాటకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరాలు సమకూర్చగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించారు. అనురాగ్‌ కులకర్ణి, సితార కృష్ణకుమార్‌ సంయుక్తంగా ఆలపించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నానికి కూతురుగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది.


అడిగా అడిగా.. అమ్మ ఒడిని గుడిగా

‘మామా మశ్చీంద్ర’ అంటూ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని హర్షవర్ధన్‌ తెరకెక్కించారు. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మించారు. మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలు. ఈ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి అమ్మ పాట విడుదల చేశారు. ‘‘అడిగా అడిగా.. విధినే అడిగా.. నను మోసిన అమ్మ ఒడిని గుడిగా’’ అంటూ భావోద్వేగభరితంగా సాగుతున్న ఈ గీతానికి చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చారు. చైతన్య ప్రసాద్‌ సాహిత్యమందించారు. శ్రీనివాసన్‌ దొరైస్వామి ఆలపించారు. ఈ చిత్రానికి పీజీ విందా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


‘లవ్‌ మౌళి’ ఆంథమ్‌..

నవదీప్‌, పంఖురి గిద్వానీ జంటగా అవనీంద్ర తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘‘ది ఆంథమ్‌ ఆఫ్‌ లవ్‌ మౌళి’’ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు గోవింద్‌ వసంత స్వరాలు సమకూర్చగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించారు. అనీష్‌ కృష్ణన్‌ ఆలపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని