Telugu Movies: ఏప్రిల్‌ ఆఖరి వారం.. థియేటర్‌/ఓటీటీలో అదిరిపోయే చిత్రాలు!

Telugu Movies: ఈ వారం బాక్సాఫీస్‌ను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే ఇటీవల విడుదలైన చిత్రాలతో పాటు, సరికొత్త సిరీస్‌లో ఓటీటీలో అలరించనున్నాయి.

Updated : 24 Apr 2023 09:56 IST

Upcoming telugu movies: వేసవి సెలవులు వచ్చేశాయి. కొత్త సినిమాల సందడి కూడా మొదలైంది. ఈ వారం థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు సందడి చేయనున్నాయి. అంతేకాదండోయ్‌ ఓటీటీల్లో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి.

యాక్షన్‌ ‘ఏజెంట్‌’

ఇప్పటివరకూ లవర్‌బాయ్‌గా మెప్పించిన అఖిల్‌ (Akhil Akkineni) ఈసారి యాక్షన్‌తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’ (Agent). సాక్షి వైద్య (Sakshi Vaidya) కథానాయిక. మమ్ముటి (Mammootty) కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 28న థియేటర్‌లలో విడుదల కానుంది. పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూస్తుంటే అఖిల్‌ను సరికొత్త అవతార్‌లో స్టైలిష్‌గా సురేందర్‌రెడ్డి చూపించబోతున్నారని అర్థమవుతోంది.


ఎన్నో ప్రశ్నలకు సమాధానం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’

గతేడాది విడుదలైన మణిరత్నం (Mani Ratnam) కలల చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) తమిళ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందులో మిగిలిపోయిన చాలా ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’  (Ponniyin Selvan2) ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. విక్రమ్‌ (Vikram), కార్తి (Karthi), జయం రవి (Jayam Ravi), ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai), త్రిష (Trisha) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య కరికాలన్‌, నందిని మధ్య ఏం జరిగింది? పెద పలవేట్టురాయర్‌, చిన పలవేట్టురాయర్‌ కుట్రలను తన తెలివి తేటలతో కుందవై ఎలా భగ్నం చేసింది? ఇందుకు వల్లవరాయ వందియదేవన్‌ చేసిన సాయం ఏంటి? తొలి భాగంలో అరుళ్‌మోళి వర్మన్‌ను కాపాడిన వృద్ధురాలు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలకు పార్ట్‌-2లో సమాధానం లభించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.


భర్తరాక కోసం ఎదురుచూసే భార్యగా...

నందితా శ్వేత (Nandita Swetha) కథానాయికగా సింగిల్‌ క్యారెక్టర్‌తో నడిచే కథతో రూపొందిన చిత్రమే ‘రా రా పెనిమిటి’ (raa raa penimiti). సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో ప్రమీల నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కొత్తగా పెళ్లైన అమ్మాయి త‌న భ‌ర్త రాకకోసం ఎదురు చూస్తూ ప‌డే విర‌హ వేద‌నే ఈ చిత్రం. ఆమె భ‌ర్త వ‌చ్చాడా?లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో తెరపై కనిపించేది ఒక్క పాత్రే అయినా... వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ వాయిస్ అందించడం విశేషం.


జల్మరీ హెలెండర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీ ‘శిసు’. జొర్మా తొమ్మిలా, అక్సెల్‌ హెన్ని, జాన్‌ డూలన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 28న ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు, హిందీలోనూ విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

ఓటీటీలో నాని బ్లాక్‌బస్టర్‌ మూవీ

శ్రీకాంత్‌ దర్శకత్వంలో నాని (Nani) కథానాయకుడిగా నటించిన మాస్‌ యాక్షన్‌ పీరియాడిక్‌ డ్రామా ‘దసరా’ (Dasara). కీర్తిసురేష్‌ (Keerthy Suresh) కథానాయిక. దీక్షిత్‌శెట్టి, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషించారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


అమెరికన్‌ స్పై థ్రిల్లర్‌ తెలుగులో..

భాషతో సంబంధం లేకుండా వెబ్‌సిరీస్‌లు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో ఆయా ఓటీటీ వేదికలు కాస్త ఆలస్యమైనా ప్రాంతీయ భాషల్లో అనువాదం చేసి సరికొత్త వెబ్‌సిరీస్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు అలా భారతీయ ప్రేక్షకులను పలకరించబోతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ (Citadel). రిచర్డ్‌ మ్యాడన్‌ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra), జోన్స్‌, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 28న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా తొలి రెండు ఎపిసోడ్‌లను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఆ తర్వాత మే నెలలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్‌ విడుదల కానుంది. దాదాపు 300 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈసిరీస్‌ను తెరకెక్కించారు. రూసో బ్రదర్స్‌, అమెజాన్‌ స్టూడియోస్‌. డేవిడ్‌ వెయిల్‌ దీనికి దర్శకత్వం వహించారు. దీనికి ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ ధావన్‌, సమంత నటిస్తున్నారు.


‘వ్యవస్థ’లో ఏం జరిగింది?

హిట్‌ చిత్రాలనే కాదు, సరికొత్త వెబ్‌సిరీస్‌లతోనూ అలరిస్తోంది ‘జీ 5’ (Zee 5) ఓటీటీ వేదిక. ఇప్పుడు మరో కొత్త వెబ్‌సిరీస్‌ ‘వ్యవస్థ’ (Vyavastha)ను ఏప్రిల్‌ 28 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. న్యాయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌కు ఆనంద్‌ రంగ దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘నారప్ప’ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన కార్తిక్‌ రత్నం, హెబ్బా పటేల్, సంపత్‌రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.


నెట్‌ఫ్లిక్స్‌

 • కోర్ట్‌ లేడీ (హిందీ వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 26
 • నోవోల్యాండ్‌(వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 26
 • ది గుడ్‌ బ్యాడ్‌ మదర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 27
 • ఎకా (హాలీవుడ్) ఏప్రిల్‌ 28
 • బిఫోర్‌ లైఫ్‌ ఆఫ్టర్‌డెత్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 28

  అమెజాన్‌ ప్రైమ్‌

 • పత్తు తల (తమిళ చిత్రం) ఏప్రిల్‌ 27

  జీ5

 • యూటర్న్‌ (హిందీ) ఏప్రిల్‌ 28

   

  బుక్‌ మై షో

   

 • స్క్రీమ్‌ 6 (హాలీవుడ్) ఏప్రిల్‌ 26

  సోనీలివ్‌

 • తురముఖమ్‌ (మలయాళ చిత్రం) ఏప్రిల్‌ 28

   

 • డిస్నీ+హాట్‌స్టార్‌

 • సేవ్‌ ది టైగర్స్‌ (తెలుగు సిరీస్‌) ఏప్రిల్‌ 27
 • పీటర్‌ పాన్‌ అండ్‌ వెండీ (హాలీవుడ్) ఏప్రిల్ 28

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని