Niharika: అందుకే ‘సాగు’కు కనెక్ట్‌ అయ్యా: నిహారిక

‘సాగు’ సినిమా తనకెంతో నచ్చిందని నిహారిక తెలిపారు. ఆమె సమర్పణలో ఈ చిత్రం మార్చి 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 29 Feb 2024 23:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వంశీ తుమ్మల, హారిక కీలక పాత్రల్లో నటించిన ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ‘సాగు’ (Saagu). వినయ్‌ రత్నం దర్శకత్వం వహించారు. నిహారిక (Niharika) సమర్పిస్తున్నారు. ఈ సినిమా మార్చి 4 నుంచి ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్ తదితర వాటిల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్క్రీనింగ్‌ పూర్తయిన అనంతరం టీమ్‌.. మీడియాతో ముచ్చటించింది.

నిహారిక మాట్లాడుతూ.. ‘సాగు’ నా హృదయాన్ని హత్తుకుంది. ఇంతకుముందు ఓసారి ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించినప్పుడు నేను అతిథిగా హాజరయ్యా. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ, వాటి గురించి బాధపడకుండా ముందుకెళ్లాలని తెలియజేసే ఈ సినిమాకు నేను కనెక్ట్‌ అయ్యా. సమస్యలు ఎదురైనప్పుడు ఒక్క అడుగులో ఓటమిని అంగీకరించకూడదు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పే సినిమా ఇది. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. రైతుల కష్టాన్ని, వారి విలువను చాటి చెబుతుంది. కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించొచ్చు. నాకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు కథ ఇది. ఇందులో ప్రధాన పాత్రలు హరిబాబు, సుబ్బలక్ష్మి. ఊరిలో ఉండే వివక్షను అధిగమించి వీరిద్దరూ ఒక్కటవుతారు. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వీరికి అడుగడుగునా సమస్యలు ఎదురవుతాయి. ఊరికి దూరంగా ఉంటూ వ్యవసాయం చేస్తుంటారు. వీరి పొలానికి నీటి సదుపాయం ఉండదు. మరి, పంట ఎలా పండించారు? ఎదుర్కొన్న సవాళ్లేంటి? తదితర అంశాలతో ఈ సినిమా రూపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని