Nikhil: సినీ ప్రియులకు నిఖిల్‌ క్షమాపణలు.. కారణం ఏమిటంటే..?

‘కార్తికేయ 2’ తర్వాత దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు నిఖిల్‌ (NIKHIL). ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘స్పై’ (SPY). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

Updated : 05 Jul 2023 14:10 IST

హైదరాబాద్‌: తన సరికొత్త చిత్రం ‘స్పై’ (SPY) ఫలితంపై నటుడు నిఖిల్‌ (Nikhil) స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా విషయంలో జరిగిన తప్పు భవిష్యత్‌లో రిపీట్‌ కాకుండా చూసుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. 

‘‘నేను నటించిన సరికొత్త ‘స్పై’ చిత్రాన్ని ఆదరించి.. నా కెరీర్‌లోనే అత్యధిక బాక్సాఫీస్‌ ఓపెనింగ్స్‌ కలెక్ట్‌ చేసిన సినిమాగా నిలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. కాంట్రాక్ట్‌/ కంటెంట్‌ ఆలస్యమైన కారణంగా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో మా సినిమా విడుదలను నిలిపివేశామని చెప్పడానికి బాధపడుతున్నా. ఓవర్సీలోనూ తెలుగు ప్రీమియర్‌కు సంబంధించి 350 షోలు రద్దయ్యాయి. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నా. ‘కార్తికేయ 2’ తర్వాత నేను ఓకే చేసిన మూడు ప్రాజెక్ట్‌లను పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేసి.. సరైన సమయంలో అన్ని భాషల్లో విడుదల చేసేలా చూస్తానని అప్పుడు అందరికీ మాటిచ్చా. కాకపోతే, కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడు జరగలేదు. తెలుగు చిత్రాలను ఆదరించే వారందరికీ మరోసారి మాటిస్తున్నా. ఇకపై నాణ్యత విషయంలో రాజీపడను. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సినిమా పూర్తయ్యాక అన్ని విధాలుగా చెక్‌ చేసి.. మంచి ప్రాజెక్ట్‌ను మీకు అందిస్తాను’’ అని నిఖిల్‌ తెలిపారు.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ అదృశ్యం వెనుక ర‌హ‌స్యాన్ని స్పృశిస్తూ.. ఓ గూఢ‌చారి క‌థ‌తో రూపొందిన చిత్ర‌మే ‘స్పై’. నిఖిల్‌, ఐశ్వర్య మేనన్‌, మకరంద్‌ దేశ్‌ పాండే, ఆర్యన్‌ రాజేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని