Devara: రెండు భాగాలుగా... దేవర

పాన్‌ ఇండియా చిత్రాలు చాలా వరకు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తూ అలరిస్తున్నాయి. తొలి భాగంతో మరింత ఆసక్తిని రేకెత్తించి, రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి.

Updated : 05 Oct 2023 13:56 IST

స్పష్టం చేసిన దర్శకుడు కొరటాల శివ

పాన్‌ ఇండియా చిత్రాలు చాలా వరకు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తూ అలరిస్తున్నాయి. తొలి భాగంతో మరింత ఆసక్తిని రేకెత్తించి, రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఆ జాబితాలో ‘దేవర’ కూడా  చేరింది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు బుధవారం వెల్లడించారు దర్శకుడు కొరటాల శివ.

ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు... ఎన్టీఆర్‌కీ, మా బృందానికీ ఈ కథ చెప్పినప్పుడు అందరం ఎంతో ఉద్వేగానికి గురయ్యాం. ఇదొక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. బలమైన పాత్రలు,  అంతే విస్తృతమైన పరిధి ఉన్న కథ ఇది. ఆ ఆత్మవిశ్వాసంతోనే చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఈ ప్రపంచం మరింత పెద్దదైంది. సన్నివేశాలు చూసుకున్నాక మాలో రెట్టింపు  ఉత్సాహం పెరిగింది. ఎడిటింగ్‌లో ఒక్క సన్నివేశం, ఒక్క సంభాషణని కూడా తొలగించలేమనే అభిప్రాయం కలిగింది. ఇలాంటి కథని ఒక్క భాగంలో ముగించడం తప్పు అనుకున్నాం. ఇంత బలమైన పాత్రల్ని, వాటి భావోద్వేగాల్ని పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురావాలంటే రెండు భాగాలుగా ఈ కథని చెప్పాలని మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. అభిమానులకి, సినీ ప్రేమికులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది.  సముద్ర తీరంలోని ఓ ప్రాంతం నేపథ్యంలో...  భయం అనే ఓ కొత్త భావోద్వేగంతో ఈ కథని రెండు భాగాలుగా చెబుతున్నాం’’ అన్నారు. తొలి భాగం సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని