Om Bhim Bush: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

‘ఓం భీమ్ బుష్‌’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. 

Updated : 08 Apr 2024 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవిష్ణు క‌థానాయకుడిగా శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bhim Bush). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌కు నవ్వులు పంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడవే నవ్వులను డిజిటల్‌ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ప్రసారం కానుంది. ఈవిషయాన్ని తెలుపుతూ ఓటీటీ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రీతి ముకుందన్, అయేషాఖాన్, ఆదిత్య మీనన్‌ తదితరులు నటించారు.

క‌థేంటంటే: లెగసీ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులు బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్ క్రిష్ (శ్రీవిష్ణు), విన‌య్ గుమ్మ‌డి (ప్రియ‌ద‌ర్శి), మ్యాడీ రేలంగి (రాహుల్ రామ‌కృష్ణ‌). వీళ్లు చేసే ప‌నులు భ‌రించ‌లేక త‌క్కువ స‌మ‌యంలోనే ముగ్గురికీ డాక్ట‌రేట్లు ఇచ్చి పంపించేస్తాడు క‌ళాశాల‌లోని ప్రొఫెస‌ర్‌. దాంతో వీరు భైర‌వ‌పురం చేరుకుంటారు. యూనివ‌ర్సిటీ జీవితంలాగే ఆ ఊళ్లో కూడా జ‌ల్సాగా బ‌తకాల‌ని నిర్ణ‌యించుకుని సైంటిస్టుల అవ‌తార‌మెత్తుతారు. ఏ టు జెడ్ స‌ర్వీసెస్ పేరుతో ఓ దుకాణం తెరిచి ఎలాంటి స‌మ‌స్య‌ల‌కైనా ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌చారం చేసుకుంటారు. కానీ ఈ ముగ్గురూ నిజ‌మైన సైంటిస్టులు కాద‌ని, ఊరి జ‌నాల్ని బురిడీ కొట్టిస్తున్నార‌నే విష‌యం బ‌య‌టప‌డుతుంది. దాంతో ఊరి స‌ర్పంచ్ ఓ ప‌రీక్ష పెడతాడు. సంపంగి మ‌హ‌ల్‌లో ఉన్న నిధిని క‌నిపెట్టి తీసుకొస్తే నిజ‌మైన సైంటిస్టుల‌ని న‌మ్ముతామ‌ని చెబుతాడు. దెయ్యం ఉన్న ఆ మ‌హ‌ల్‌లోకి నిధి కోసం వెళ్లాక ఈ బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇంత‌కీ ఆ మహల్‌లో ఉన్న సంపంగి దెయ్యం క‌థేమిటి? అస‌లు వీళ్లు నిధిని తీసుకొచ్చారా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Om Bhim Bush on amazon prime).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని