Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. వరుణ్ ఖాతాలో హిట్‌ పడిందా?

Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ కీలక పాత్రలో శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్‌’ మెప్పించిందా?

Updated : 01 Mar 2024 19:01 IST

Operation Valentine Review: చిత్రం: ఆపరేషన్‌ వాలెంటైన్‌; నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు; సంగీతం: మిక్కీ జే మేయర్‌; సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా; నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద; దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా; విడుదల: 01-03-2024

రియల్ యాక్ష‌న్ జోన‌ర్ సినిమాల నిర్మాణంపై భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లు ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నాయి. హృతిక్ రోష‌న్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన ‘ఫైట‌ర్‌’ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆ త‌ర్వాత అదే జాన‌ర్‌లో ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్‌’ (Operation Valentine) రూపొందింది. ఇందులో తెలుగు క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ (Varun Tej) ప్ర‌ధాన పాత్ర పోషించ‌డం విశేషం. తెలుగులో రూపొందిన తొలి ఏరియ‌ల్ యాక్ష‌న్ చిత్ర‌మిదే. హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని  రెండు చోట్లా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  వ‌రుణ్‌తేజ్ ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా ఒదిగిపోయాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

క‌థేంటంటే: అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర  (వ‌రుణ్‌తేజ్‌) భార‌తీయ వైమానిక ద‌ళంలో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ ధైర్య సాహ‌సాలతో అడుగేసే ర‌కం.  వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలో ఓ చేదు అనుభ‌వం ఎదుర‌వుతుంది. దాన్నుంచి కోలుకుంటున్న క్ర‌మంలోనే ఆయ‌న ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? (Operation Valentine Review in telugu) ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి?త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో రూపొందిన చిత్ర‌మిది. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్  వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. రెండు దేశాల మ‌ధ్య పోరాటం, దేశ‌భ‌క్తి నేప‌థ్యం అన‌గానే మ‌న‌కు ఎక్కువ‌గా సైనిక ద‌ళం నేప‌థ్యంలో సాగే సినిమాలే గుర్తొస్తాయి. అయితే దేశాల్ని ర‌క్షించ‌డంలో త్రివిధ ద‌ళాల‌దీ కీల‌క‌పాత్రే. సైనిక, నావిక, వైమానిక ద‌ళాల్లో ఏ ద‌ళం ప్ర‌త్యేక‌త దానిదే. గ‌గ‌న‌త‌లంలో కాప‌లా కాస్తూ, శ‌త్రువుల నుంచి పొంచి ఉన్న ప్ర‌మాదాల్ని ముందే ప‌సిగ‌డుతూ పోరాటం చేసే  వైమానిక ద‌ళం,  (Operation Valentine Review) అది చూపే తెగువ పెద్ద‌గా వెలుగులోకి రాలేదు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ త‌ర్వాత మ‌న వైమానిక ద‌ళం కీర్తి మ‌రింతగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. ఆ నేప‌థ్యంలో సినిమాలు చేయ‌డంపై మన చిత్ర పరిశ్రమలు దృష్టిపెట్టాయి.

ఫైట‌ర్ జెట్ పైల‌ట్ అయిన క‌థానాయ‌కుడి ధైర్యసాహ‌సాలు, దేశ‌భ‌క్తి నేప‌థ్య‌మే ప్ర‌ధానంగా రూపొందిన చిత్ర‌మిది. ప్రాజెక్ట్ వజ్రతో క‌థ‌ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత ఒక్కొక్క సంఘ‌ట‌న‌ని తెర‌పై ఆవిష్క‌రిస్తూ వెళ్లాడు. పుల్వామా దాడి, ప్ర‌తిగా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌, ఆ త‌ర్వాత పాకిస్థాన్‌ ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ నెహ్రూ, దాన్ని తిప్పి కొట్టేందుకు వ‌జ్ర ప్ర‌యోగాన్ని అమ‌లు చేయ‌డం వంటి సంఘ‌ట‌న‌ల‌తో ఈ చిత్రం సాగుతుంది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో భావోద్వేగాలు, గ‌గ‌న‌తంలో ఫైట‌ర్ జెట్ల వీర విహారంతో కూడిన విజువ‌ల్స్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం, ప్ర‌త్యేక‌మైన ఆక‌ర్ష‌ణ‌. (Operation Valentine Review in telugu)  పుల్వామా దాడిలో సైనికుడు త‌న ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడ‌టం, ఎప్పుడూ వారిస్తూ క‌నిపించే పై అధికారి ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ రుద్ర సాహ‌సాల్ని ప్రోత్స‌హించడం, శ‌త్రువుల స్థావ‌రాల్ని ధ్వంసం చేయ‌డం వంటి స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తాయి. వ‌జ్ర ప్రాజెక్ట్ ప్ర‌యోగంతో కూడిన ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య సాగే సన్నివేశాల్లో గాఢ‌త లేక‌పోవ‌డం, ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం సినిమాకి మైన‌స్‌గా మారింది.

ఎవ‌రెలా చేశారంటే: నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా వ‌రుణ్‌తేజ్ పాత్ర‌లో ఒదిగిపోయారు. భావోద్వేగ ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాల్లోనూ మంచి ప్ర‌తిభ చూపించారు. మానుషిచిల్ల‌ర్ పాత్ర‌కీ ప్రాధాన్యం ఉంది. దాదాపుగా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. మిగిలిన పాత్ర‌ల‌న్నీప‌రిమితంగానే క‌నిపిస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. సన్నివేశాలు స‌హ‌జంగా ఉంటాయి. ర‌చ‌న ప‌రంగానే మ‌రిన్ని క‌స‌ర‌త్తులు అవ‌స‌రం అనిపిస్తుంది. క‌థ‌నంలో బ‌లం లేదు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హ‌డా వైమానిక ద‌ళం, ఆప‌రేష‌న్లు, వాళ్ల ధైర్య సాహ‌సాల్ని సహ‌జంగా తెర‌పై చూపించారు కానీ, క‌థ‌లో డ్రామానే కొర‌వ‌డింది.  

  • బ‌లాలు
  • + దేశ‌భ‌క్తి  ప్ర‌ధానంగా సాగే స‌న్నివేశాలు  
  • +  వ‌రుణ్‌తేజ్, మానుషి చిల్ల‌ర్‌
  • +  విజువ‌ల్స్
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌నం
  • కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌రిగా: ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ గ‌గ‌న‌వీధిలో పోరాటం (Operation Valentine Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని