Ramayana: ‘రామాయణ’ కోసం ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌!

బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘రామాయణ’పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Published : 05 Apr 2024 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’గా ఇది రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌ మ్యూజికల్‌ విశేషాలు సందడి చేస్తున్నాయి.

సినిమాకు ఎంతో ముఖ్యమైన సంగీతం కోసం చిత్రబృందం ఆస్కార్‌ విజేతలను సెలెక్ట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఏఆర్‌ రెహమాన్‌తో పాటు హాలీవుడ్‌ ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హన్స్‌ జిమ్మెర్‌ దీనికి ట్యూన్స్‌ అందించనున్నారట. హన్స్‌ జిమ్మెర్‌ హాలీవుడ్‌లోని టాప్‌ సినిమాలకు సంగీతం అందించారు. ఆయనకు ఈ కథ గురించి వివరించగానే వెంటనే అంగీకరించారని.. దీని పనులు మొదలుపెట్టేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం. ఇందులోని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోవాలనే మూవీ యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని కూడా కొన్ని ఫొటోలు సందడి చేశాయి. దీనికోసం భారీ సెట్‌ వేశారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram)కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొదటి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇక దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని మూవీ యూనిట్‌ యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది. రణ్‌బీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రామాయణ’ కోసం తన అలవాట్లను మార్చుకున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని