Tollywood: పాన్‌ ఇండియా మార్కెట్‌... ఈసారి మన ప్రభావం ఎంత?

టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్‌.. అన్ని చిత్రసీమలదీ ‘పాన్‌ ఇండియా’ జపమే! భాషల మధ్య హద్దుల్ని చెరిపేసి సరికొత్త వ్యాపారానికి బాటలు వేసిన మార్కెట్‌ వ్యూహం ఇది. ప్రాంతీయ భాషల్లో రూపొందిన చిత్రాలు సైతం జాతీయ స్థాయిలో వీరవిహారం చేయొచ్చనీ.. ‘మన మార్కెట్‌ పరిధి ఇంతే’ అన్న పరిమితులు దాటి వసూళ్లు కొల్లగొట్టవచ్చనీ వేసిన చాటింపు ఇది.

Updated : 20 Dec 2023 11:13 IST

టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్‌.. అన్ని చిత్రసీమలదీ ‘పాన్‌ ఇండియా’ జపమే! భాషల మధ్య హద్దుల్ని చెరిపేసి సరికొత్త వ్యాపారానికి బాటలు వేసిన మార్కెట్‌ వ్యూహం ఇది. ప్రాంతీయ భాషల్లో రూపొందిన చిత్రాలు సైతం జాతీయ స్థాయిలో వీరవిహారం చేయొచ్చనీ.. ‘మన మార్కెట్‌ పరిధి ఇంతే’ అన్న పరిమితులు దాటి వసూళ్లు కొల్లగొట్టవచ్చనీ వేసిన చాటింపు ఇది.ఈ సూత్రాన్ని అందరికంటే ఎక్కువగా తెలుగు పరిశ్రమే ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో పాన్‌ ఇండియా సినిమాలు మన దగ్గర రూపొందుతుండడమే అందుకు కారణం. మరి 2023లో మనం ఎంత ప్రభావం చూపించాం?

బాలీవుడ్‌ కోటపై ప్రభాస్‌ జెండా ఎగరేసినా.. ‘తగ్గేదేలే’ అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ‘పుష్ప’ మేనరిజమ్‌తో ఊగిపోయినా... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు మరోసారి ఉత్తరాది బాక్సాఫీస్‌ కుంభస్థలాన్ని బద్దలు కొట్టినా అదంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ ప్రభావమే. ‘బాహుబలి’, ‘కె.జి.ఎఫ్‌.’ చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్‌ ఇండియా ఫీవర్‌ మొదలైంది. ‘కార్తికేయ2’, ‘కాంతార’ తదితర చిత్రాలు సత్తా చాటాయి.సినిమా ఏ భాషలో తెరకెక్కిందన్నది ముఖ్యం కాదు... అందులో బలం ఉంటే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుందని ఆ సినిమాలు చాటి చెప్పాయి. అప్పట్నుంచి అదే బాటలో భారీ కథల్ని తెరకెక్కించి జాతీయస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

నచ్చింది మనకే

నాని నటించిన ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’, సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’, విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’, రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’, సమంత ‘శాకుంతలం’, రామ్‌ ‘స్కంద’, నిఖిల్‌ ‘స్పై’, పాయల్‌ రాజ్‌పూత్‌ నటించిన ‘మంగళవారం’... ఇలా ఈ సంవత్సరం చాలా సినిమాలు పాన్‌ ఇండియా చిత్రాలుగానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ‘ఏజెంట్‌’ కూడా పాన్‌ ఇండియా చిత్రంగానే పట్టాలెక్కింది. కానీ తెలుగులోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’, ‘విరూపాక్ష’, ‘ఖుషి’, ‘మంగళవారం’ చిత్రాలు మన ప్రేక్షకుల్ని మెప్పిస్తూ, మంచి వసూళ్లని సాధించాయి. పొరుగు భాషల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మిగతా చిత్రాలైతే ఎక్కడా సరైన ఆదరణ పొందలేకపోయాయి. ‘సార్‌’, ‘కస్టడీ’ చిత్రాలు ద్విభాషా చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ‘సార్‌’ మాత్రమే విజయాన్ని అందుకుంది.

గాలి అటు నుంచి...

కొన్నేళ్లుగా ఎక్కువగా మన చిత్రాలే పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభావం చూపించాయి. ఈసారి మాత్రం గాలి అటు నుంచి ఇటు వీచింది. హిందీ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘యానిమల్‌’ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సొంతం చేసుకొంటోంది. తెలుగు దర్శకుడు, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ వంగా తెరకెక్కించారు. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టాయి. రజనీకాంత్‌కి ‘జైలర్‌’తో ఘనవిజయం దక్కింది. విక్రమ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ ఫర్వాలేదనిపించింది. విజయ్‌ ‘లియో’ చిత్రానికీ మంచి వసూళ్లు దక్కాయి. ‘మార్క్‌ ఆంటోనీ’, ‘జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌’ తదితర చిత్రాలు తెలుగు మార్కెట్‌పై కొద్దిమేర ప్రభావం చూపించాయి. హిందీ నుంచి వచ్చిన సన్నీ దేవోల్‌ ‘గదర్‌2’, సల్మాన్‌ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీకీ జాన్‌’,  ‘టైగర్‌ 3’ చిత్రాలు హిందీ స్థాయిలో తెలుగు మార్కెట్‌లో ప్రభావం చూపించలేకపోయాయి. పాన్‌ ఇండియా హంగులతో రూపొందే సినిమాలు కొన్నయితే, ఆ మార్కెట్‌ని సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో రూపొందే సినిమాలు ఇంకొన్ని. అలా మార్కెట్‌ని సొమ్ము చేసుకోవాలని వచ్చిన చిత్రాలేవీ ప్రభావం చూపించలేకపోయాయి.

సలార్‌పైనే దృష్టి

కొద్దిమంది హీరోలు సినిమా చేశారంటే... ఇక అది పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సిందే. వాళ్లు చేసే సినిమాల స్థాయి, వాళ్లకున్న గుర్తింపు అలాంటిది. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు... ఇప్పుడు అదే బాటలోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రభాస్‌ నటించే ప్రతి సినిమా పాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందుతోంది. ఈ ఏడాది ఆయన నటించిన ‘ఆదిపురుష్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ హంగులతో రూపొందిన ఆ చిత్రం ఆయన మార్కెట్‌కి తగ్గట్టుగానే పలు భాషల్లో విడుదలైంది. కానీ హిందీ దర్శకుడు ఓం రౌత్‌ తీసిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇప్పుడందరి దృష్టి ఈ నెల 22న విడుదలవుతున్న ‘సలార్‌’పైనే ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని