Paruchuri: అలాంటి అభిమానులు పవన్‌ కల్యాణ్‌కే సొంతం: పరుచూరి గోపాలకృష్ణ

కూటమి విజయం సాధించినందుకు పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) అభినందనలు తెలియచేశారు. కూటమి సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Published : 06 Jun 2024 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కూటమి సభ్యులకు విషెస్‌ చెప్పగా.. తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. చంద్రబాబు (Chandrababu Naidu), పురందేశ్వరి, పవన కల్యాణ్‌లతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

‘ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారు. ఈ ఎన్నికల్లో అదే జరిగింది. ప్రజలు కోరుకున్నవిధంగా రాజకీయ నాయకులు ఉండకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని నిరూపించారు. నాకు చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. ఆయన గవర్నమెంట్‌లో గతంలో నేను పని చేశాను. పోరాటశక్తికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఆయన అరెస్ట్‌ చాలా బాధాకరమైన విషయం. దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డాను. ప్రజలను మెప్పించారు. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబును పరుచూరి గోపాలకృష్ణ అభినందించారు.

పవన్‌ జర్నీపై అకీరా స్పెషల్‌ వీడియో.. వావ్‌ అంటోన్న నెటిజన్లు

‘నేను పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాకు పని చేయలేదు. మేమిద్దరం ఒక్కసారే కలిశాం. పవన్‌కు బిడియం ఎక్కువ. కానీ, ఈ ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో పని చేశాడు. ఏ క్షణం ఆయన కళ్లలోకి చూసినా ‘నేను సాధిస్తున్నా’ అనే విశ్వాసం కనిపించింది. ఆయన అభిమానులు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో నాకు తెలుసు. పవన్‌ కల్యాణ్‌ను చూసినప్పుడు వాళ్ల అరుపులు వింటే కంఠ నరాలు తెగిపోతాయేమో అనిపిస్తుంది. అంత గొప్ప ఫ్యాన్స్ ఆయన సొంతం. వాళ్లందరినీ ఒప్పించి తెదేపా, భాజపాలతో కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలను మెప్పించి విజయం సాధించారు. ఒకవేళ ఆయన కూటమిలో భాగం కాకపోతే ఏమయ్యేదో చెప్పలేకపోయేవాళ్లం. ఆ పరిస్థితి రానివ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారు. గెలిచాక కూడా పవన్‌ ఎంతో వినయంతో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎలా నేరవేర్చాలనే ఆలోచనతోనే మాట్లాడారు. ఎవరినీ నిందించలేదు. అలా మాట్లాడడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం’ అంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించారు.

‘నాకు పురందేశ్వరి (Purandeswari) చెల్లెలితో సమానం. ఆమె గెలవాలని కోరుకున్నాను. బాలకృష్ణ గెలుస్తారని ముందే తెలుసు. ఆయనతో పాటు పురందేశ్వరి కూడా గెలవాలని కోరుకున్నా. ఆమె రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. తెలుగుకు మరోసారి వెలుగు తెచ్చేందుకు ఆమె కృషి చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు