Salaar: ‘సలార్‌’ అద్భుతం.. వారి కోసం తప్పక చూడాలి: పరుచూరి

‘సలార్‌’ (Salaar)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna).

Updated : 27 Jan 2024 13:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్ర పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇటీవల దీనిని వీక్షించిన ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా రివ్యూ చెప్పారు. టీమ్‌కు అభినందనలు తెలుపుతూ వీడియో రిలీజ్‌ చేశారు.

Rajinikanth: రీసెంట్‌ ట్రోల్స్‌పై స్పందించిన ఐశ్వర్య.. రజనీకాంత్‌ కంటతడి

‘‘జానపదం, సాంఘికం, చారిత్రాత్మకం, పౌరాణికం.. ఇలా ప్రపంచ దేశాల్లో సినిమా ఎన్ని రకాలుగా ఉంటుందో వాటన్నింటినీ ఒకేచోట ఉంచితే అదే ‘సలార్‌’. ఇది ప్రభాస్‌ వన్‌ మ్యాన్‌ షో. అందులో ఎలాంటి సందేహం లేదు. మరో కీలకమైన వ్యక్తి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన దర్శకత్వంలో ఈ కథ ఇలా వచ్చి ఉండకపోతే ఇంత హిట్‌ అందుకునేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఇది ఇండియాలో జరిగిన కథగా చూపిస్తే దీనికి సెన్సార్‌ అంత తేలిగ్గా రాదు. ఎందుకంటే, ఇందులో కొన్ని సన్నివేశాల్లో తీవ్రమైన హింస ఉంది. మన పొరుగున ఉన్న మూడు చిన్న దేశాల్లో ఇది జరిగినట్టు చూపించారు. 1127లో మూడు జాతులకు చెందిన కథగా ఇది మొదలైంది. 1980, 2017 వరకూ ఈ కథనాన్ని నడిపించారు. ‘‘అఖండ భారతదేశంలో కలవడానికి రాజమన్నార్‌ తండ్రి అంగీకరించలేదు’’ అనే మాటలు స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడికి ఉన్న స్పష్టతను తెలియజేశాయి. ఒక సాధారణ కథగా దీనిని మొదలుపెట్టి కొన్ని సన్నివేశాల అనంతరం ‘సలార్‌’ స్టోరీ రివీల్‌ చేయడం చూస్తే.. స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఆటలాడుకున్నారని చెప్పొచ్చు. కథా కథనంతో మరో లోకంలోకి తీసుకువెళ్లారు. దాదాపు 30 నిమిషాల వరకూ హీరో మాట్లాడిన సందర్భాలు కనిపించలేదు. ప్రభాస్‌ని గొప్పగా చూపించారు. పార్ట్‌ 1 అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రభాస్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ స్క్రీన్‌ప్లే, స్నేహధర్మం కోసం అని చెబుతా. పాత్రధారులందరూ అద్భుతంగా నటించినప్పటికీ థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ మాత్రమే మనకు గుర్తుంటారు. ‘సలార్‌’తో గొప్ప విజయాన్ని అందుకున్న ప్రభాస్‌, ప్రశాంత్‌నీల్‌, ఇతర తారాగణానికి నా అభినందనలు’’ అని పరుచూరి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని