Gangubai Kathiawadi: ‘గంగూబాయి కాఠియావాడి’ ఎక్కువ భాగం వాస్తవాలే అనుకుంటున్నా : పరుచూరి

ముంబయి మాఫియా డాన్‌గా పేరు పొందిన గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘గంగూబాయి కాఠియావాడి’పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

Updated : 01 Oct 2022 16:22 IST

హైదరాబాద్‌: ముంబయి మాఫియా మహిళాడాన్‌గా పేరు పొందిన గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘గంగూబాయి కాఠియావాడి’పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి పలుకులు వేదికగా తాజాగా ఆయన ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.

‘‘ఇది హృదయాలను హత్తుకునే అద్భుతమైన కథ. ప్రేమలో మోసపోయి.. వేశ్యగా మారి.. అంధకారంలో ఉన్న ఎంతోమంది వేశ్యలకు నాయకురాలిగా.. వారి జీవితాలను కాపాడటం కోసం ఏకంగా ప్రధానమంత్రితోనే సమావేశమైన ఓ మహిళ కథ ఇది. కథలోనే ఎంతో బలం ఉంది. కాబట్టి ఏ రచయిత అయినా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. ఇలాంటి కథతోనే మన తెలుగులోనూ ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా పొందిన విజయం మన చిత్రాలు అందుకోలేకపోయాయి. వేశ్య వృత్తిని బ్యాన్‌ చేయాలని కాకుండా వాళ్ల హక్కుల కోసం పోరాటం చేస్తూ దీన్ని రూపొందించారు. అందుకే ప్రేక్షకులు దీన్ని విపరీతంగా ఆదరించారు.

ఈ కథను మొదలుపెట్టడమే హృదయ విదారక సన్నివేశాలతో చూపించారు. ఒక చిన్న పాపను ఈ కూపంలోకి తీసుకురావడం.. ఆమెను ఒప్పించడానికి గంగూబాయి రావడం.. ఆమె తన కథను చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తనతో పాటు నరకకూపంలో నలిగిపోతున్న వేశ్యలకు హక్కులు ఉండాలంటూ గంగూ చేసిన పోరాటాన్ని చక్కగా చూపించారు. ప్రధానమంత్రితో సమావేశమైన తర్వాత గంగూ పాత్రలో అలియా చెప్పే డైలాగులు ఆసక్తిగా ఉంటాయి. ‘‘తల్లి ప్రేమకు తండ్రి రక్షణకు దూరమైన ఈ జీవితాలను ఎవరు రక్షించాలి’’ అంటూ ఆమె చెప్పడం ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రహీం లాలాగా అజయ్‌ దేవ్‌గణ్‌ అద్భుతమైన పాత్రలో నటించారు.

ఇక, చివరి రెండు, మూడు నిమిషాల్లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఎవరైతే గంగూను ఓడించాలనుకున్నారో వాళ్లందరూ ఆమెపై పువ్వులు జల్లుతున్నట్లు చూపించి సినిమా ముగించారు. సంజయ్‌ లీలా భన్సాలీ.. సామాజిక నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో గంగూబాయి పాత్రలో నటించి అలియాభట్‌ మెప్పించింది. ఈ సినిమా చూశాక.. ఇందులో ఎక్కువ భాగం వాస్తవాలే అని.. తక్కువ భాగం క్రియేషన్‌ అనుకుంటున్నా’’ అని పరుచూరి పేర్కొన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని