Bhagavanth Kesari: అలా చేసి ఉంటే.. ‘భగవంత్‌ కేసరి’ దెబ్బతినేది: పరుచూరి గోపాలకృష్ణ

‘పరుచూరి పాఠాలు’లో భాగంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. ‘భగవంత్‌ కేసరి’ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

Updated : 09 Dec 2023 10:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి (Director Anil Ravipudi) కబడ్డీ ఆడుకున్నాడని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) ప్రశంసించారు. ఆయన ఎప్పుడూ విజయానికి దూరంకాలేదన్నారు. ‘పరుచూరి పాఠాలు’ (Paruchuri Paatalu) పేరుతో యూట్యూబ్‌ వేదికగా గోపాలకృష్ణ సినిమాలపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ‘భగవంత్‌ కేసరి’పై తనదైన శైలి రివ్యూ ఇచ్చారు. బాలకృష్ణ (Balakrishna), శ్రీలీల (Sree Leela), కాజల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా గురించి గోపాలకృష్ణ ఏమన్నారంటే..

స్క్రీన్‌ప్లే అందమంటే ఇదీ..

‘‘బాలకృష్ణ ఇటీవల వరుస విజయాలు సాధించారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. హీరో ఎవరైనా ఓ స్థాయికి చేరుకున్న దానికి తగ్గ పాత్రలను ఎంపిక చేసుకోకపోతే సంబంధిత సినిమా అనుకున్నంతగా సక్సెస్‌ కాదు. అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే బాడీ లాంగ్వేజ్‌కు మ్యాచ్‌ అయ్యే రోల్స్‌లోనే నటించాలి. విజయం ఎప్పుడూ దర్శకుడు అనిల్‌ రావిపూడి గుప్పిట్లోనే ఉంటుంది. ‘భగవంత్‌ కేసరి’ విషయానికొస్తే.. ప్రధాన అంశానికి (కూతురు సెంటిమెంట్‌) కట్టుబడి ఉండి బాలకృష్ణ- కాజల్‌ల మధ్య ప్రేమను సెకండరీగా చూపించాడు. సాధారణంగా ఏ హీరోయిన్‌ ఇలాంటి రోల్‌కు అంగీకరించకపోవచ్చు. ఈ విషయంలో కాజల్‌ను మెచ్చుకోవాలి. తండ్రి, కూతురు సెంటిమెంట్‌ కథలను మనం చాలా చూశాం. కానీ, రొటీన్‌కు భిన్నంగా అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లేతో కబడ్డీ ఆడుకున్నాడు. ప్రారంభ సన్నివేశాల్లో జైల్లో ఖైదీగా ఉన్న హీరో.. మరో ఖైదీపై హత్యాయత్నం జరుగుతుంటే కాపాడతాడు. ఆ సాయం పొందిన వ్యక్తి క్లైమాక్స్‌లో హీరోకు అండగా నిలుస్తాడు. ఇదీ స్క్రీన్‌ప్లే అందం. సంభాషణలన్నింటినీ అనిల్‌ రాశాడో, ఎవరైనా సహకారం అందించారో తెలియదుగానీ ఎప్పటికీ నిలిచిపోతాయి. దర్శకుడు బి.గోపాల్‌ చిత్రాల్లో ఇలాంటి కంపోజ్డ్‌ డైలాగ్స్‌ ఉంటాయి. ‘ఆకలేసి వచ్చినవాడికి అన్నం పెట్టాలి. ఆపదలో ఉన్నవాడికి నీ ప్రాణం పెట్టాలి’, ‘ఓటు మీద వచ్చే పదవులు కాదు.. ఓటమిలేని స్థానం కావాలి’లాంటి ఎన్నో అద్భుతమైన మాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సంభాషణల గురించీ ప్రత్యేకంగా చర్చించుకోవచ్చు’’

సెకండాఫ్‌లో ట్రిమ్‌ చేయాల్సింది..!

‘‘సీనియర్‌ నటి జయచిత్ర చిన్న పాత్ర పోషించారు. పశ్చాత్తాపంతో కూడిన పాత్రలో ఆమె కనిపించింది. ఆ క్యారెక్టర్‌ బిడ్డ (హీరో)ను చూసి చనిపోవాలనుకోవడంలోనూ అనిల్‌ స్క్రీన్‌ప్లే ప్రతిభ కనిపిస్తుంది. తల్లి కారణంగానే హీరో జైలుకెళ్లాల్సి వచ్చిందనే ట్విస్ట్‌ను ముందే రివీల్‌ చేయకుండా సెకండాఫ్‌లో చెప్పి మెప్పించాడు. NBK అంటే నందమూరి బాలకృష్ణ. ఇందులోని హీరో పాత్రను (నేలకొండ భగవంత్‌ కేసరి) NBKగా సెట్‌ చేయడంలోనూ అనిల్‌కు మంచి మార్కులు వేయాల్సిందే. ‘నేరం-శిక్ష’ అన్న కాన్సెప్ట్‌లో తన జీవితాన్ని జైలుపాలు చేసిన విలన్లను అంతమొందించడమనేది హీరో కథగా చూపిస్తే ఈ సినిమా ఇంత గొప్పగా ఉండేది కాదు. తాను పెంచుతున్న అమ్మాయి (శ్రీలీల)ని.. ఆమె తండ్రి (శరత్‌కుమార్‌) ఆశయం కోసం మిలటరీకు పంపించాలనే నేపథ్యాన్ని హైలైట్‌ చేయడంతో కొత్తదనం వచ్చింది.

ఆ ఆశయం కోసమే హీరో కష్టపడతాడు. ఒకవేళ అది నెరవేరకపోయి ఉంటే సినిమా దెబ్బతిని ఉండేది. శ్రీలీల పాత్ర విషయంలో అనిల్‌ చీటింగ్‌ స్క్రీన్‌ప్లే రాశాడు (నవ్వుతూ). ఆమె అప్పుడప్పుడు భయపడుతున్నట్లు కనిపించడంతో ‘మిలటరీ ట్రైనింగ్‌ తీసుకోలేదు.. బాలకృష్ణ ఆమెకు పెళ్లి చేసి పంపించేస్తాడు’ అని ప్రేక్షకుడు అనుకునేలా మలిచాడు. ‘‘సెకండాఫ్‌లో కొంత ట్రిమ్‌ చేయాల్సింది. ఈ సినిమా నిడివిని సుమారు రెండున్నర గంటలుగా తీర్చిదిద్ది ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది’’ అని అనిల్‌కు ఫోన్‌ చేసి నా అభిప్రాయం చెప్పా. హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్యను, డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టిన అనిల్‌ రావిపూడికి, చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు