‘గాడ్‌ఫాదర్‌’ నెమ్మదిగా సాగే కథ.. చిరు ఉండగా అలా చేయడం నచ్చలేదు: పరుచూరి గోపాలకృష్ణ

‘గాడ్‌ఫాదర్‌’పై రివ్యూ చెప్పారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. సినిమాలో ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదని ఆయన అన్నారు.

Updated : 26 Nov 2022 12:26 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather)పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). మలయాళీ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన కొన్ని మార్పులు బాగున్నాయని అన్నారు. అయితే, చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు ఇలాంటి స్లో పేస్‌ కథలు సెట్‌ కావని తెలిపారు.

‘‘తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ యథాతథంగా ‘లూసిఫర్‌’ కథనే ‘గాడ్‌ఫాదర్‌’గా తెరకెక్కించారు. చిత్రబృందం కష్టపడి కథలో తెలుగుదనం కనిపించేలా చర్యలు తీసుకుంది. అందుకే ఈసినిమా విజయవంతమైంది. ఇదొక కర్ణుడి కథ. తన చెల్లెళ్లకు దూరంగా ఉండే ఓ అన్నయ్య.. వాళ్లని అనుక్షణం ఎలా కాపాడాడు? వాళ్ల ప్రేమను ఎలా పొందాడు? అనే ఆసక్తికర అంశాలతో దీన్ని తెరకెక్కించారు. మాతృకలో లేనివిధంగా ‘గాడ్‌ఫాదర్‌’లో నయనతారకు ఒక చెల్లి ఉన్నట్లు చూపించారు. సమయానుగుణంగా ట్విస్టులను రివీల్‌ చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆయన స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నారు. మాతృకతో పోలిస్తే తెలుగులో మంచి స్క్రీన్‌ప్లే ఉంది. ఈకథలో పరోక్షంగా  తెలుగు రాజకీయాలను కూడా మిళితం చేసి చూపించారు. కథ, కథనం, డైలాగ్స్‌ పరంగా కాకుండా కేవలం చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు వేరేలా ఉంటే బాగుండేదని నా భావన’’

‘‘1. ఈ కథ కాస్త స్లో పేస్‌లో సాగుతుంది. మోహన్‌లాల్‌ పాత్రను ఫాలో కావాలని దర్శకుడు, రచయిత, నిర్మాత చిరంజీవికి చెప్పారా? లేదా చిరంజీవే ఆ రోల్‌ను అలాగే చేయాలనుకున్నారా? అనేది తెలియదు. కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు స్లో పేస్‌ నప్పలేదు.

2. ఇది చిరుకి సరిపడే పాత్ర కానప్పటికీ..  దర్శకుడు చాలావరకూ విజయం సాధించాడు.

3. చిరంజీవి పాత్రకు డ్యాన్సులు లేకుండా ఉండటం కాస్త ఇబ్బందిగా అనిపించింది.

4. షఫీ వేసిన పాత్రను సునీల్‌ చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది.

5. సల్మాన్‌ ఈ సినిమాకి ఒక ప్లస్‌.. అలాగే మైనస్‌ కూడా. ఎందుకంటే గాడ్‌ఫాదర్‌కు నమ్మిన బంటుగా కనిపించిన సల్మాన్‌ రౌడీలతో పోరాటాలు చేస్తూ స్క్రీన్‌పై అదరగొట్టేశాడు. అయితే, చిరంజీవి ఉండగా సల్మాన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లు చేయడం అభిమానులకు అంతగా నప్పదు. సల్మాన్‌ పోషించిన పాత్రలో రామ్‌చరణ్‌, లేదా పవన్‌కల్యాణ్‌ ఉండుంటే ఆ వ్యత్యాసం తెలిసేది కాదు.

6. డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇంకాస్త పవర్‌ఫుల్‌ మాటలు ఉండుంటే మరిన్ని చప్పట్లు పడేవి.. అని పరుచూరి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని