Eagle: ‘ఈగల్‌’.. ఆ విషయంలో దర్శకుడిది సాహసమే: పరుచూరి గోపాలకృష్ణ

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఈగల్‌’ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 09 Mar 2024 10:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌, నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలై, అలరించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win), ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఈ సినిమాపై తాజాగా రివ్యూ ఇచ్చారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

‘‘సినిమాల విషయంలో మహిళా ప్రేక్షకులు, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు వేర్వేరుగా ఉంటాయి. ‘ఈగల్‌’లో మాస్‌ ఆడియన్స్‌ను తల తిప్పుకోకుండా చేసే ఎలిమెంట్స్‌ మెండుగా ఉన్నాయి. ఇందులో పత్తి రైతుల సమస్యలను టచ్‌ చేశారు. నేను ముందుగా హీరోని రైతు అని భావించా. మరోవైపు, మారణాయుధాల మాఫియాను ప్రధానాంశంగా తీసుకున్నారు. ఇందులో రవితేజ బాడీ లాంగ్వేజ్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కథ, కథనాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేందుకు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రీన్‌ప్లేను వేగంగా రన్‌ చేశారు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష.. ఇలా మూడు కోణాల్లో కథని చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో, ఎవరు? ఎవరి గురించి చెబుతున్నారు? అనేది అర్థమవదు. నవదీప్‌ పాత్ర కొంత కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో ప్రేమకథ లోపించిందని ముందు అనిపిస్తుంది. తర్వాత  ఎప్పటికో అది తారసపడుతుంది’’

‘‘కామెడీ, ప్రేమ.. యువతను ఎక్కువగా అలరించే అంశాలు. ఈ రెండూ లేకుండా సినిమాని తెరకెక్కించి దర్శకుడు సాహసం చేశారు. ప్రధాన పాత్రల నుంచి కాకపోయినా విలన్‌ గ్యాంగ్‌ నుంచి దర్శకుడు వినోదాన్ని రాబట్టారు. ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీని చూపించారు. ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో కొండ (బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి) ప్రస్తావన రాగానే కొన్ని పాత్రలు ఒణికిపోతాయి. దర్శకుడు ఆ షాట్‌ని అద్భుతంగా తీశారు. ‘కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి’.. ఇలా అలతి పదాలతో రాసిన డైలాగ్స్‌ బాగున్నాయి. ఫిజికల్‌ ఫైట్స్‌ కన్నా ఎక్కువగా గన్‌ ఫైట్స్‌తోనే సినిమాని నడిపించారు. ఒక్క సీన్‌కు ప్రేక్షకుడు డిస్‌ కనెక్ట్‌ అయినా.. దృష్టిని కేంద్రీకరించకపోయినా సినిమా అర్థం కాదు. క్షుణ్ణంగా చూడాల్సిన చిత్రమిది’’

‘‘తుపాకీ కాల్పుల నేపథ్యంలో ఎక్కువ సన్నివేశాలున్నాయి. వాటిని తగ్గించాల్సింది. కానీ, మాస్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి. యూత్‌కు ప్రేమ కావాలనే విషయాన్ని నేటి దర్శకులు అర్థం చేసుకోవాలి. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా స్క్రీన్‌ప్లేని నడిపిస్తే రెట్టింపు ఫలితం వస్తుంది’’ అని వర్ధమాన దర్శక, రచయితలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని