Family Star: విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’ ఆడకపోవడానికి కారణమిదే!

విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ జంటగా పరశురామ్‌ తెరకెక్కించిన ‘ఫ్యామిలీస్టార్‌’ పెద్దగా ఆడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Published : 01 Jun 2024 11:47 IST

హైదరాబాద్‌: ‘ఫ్యామిలీస్టార్‌’ (Family Star Movie) విజయ్‌ దేవరకొండ కథేనని, అయితే కథనంలో ఆయన బాడీ లాంగ్వేజ్‌ను దాటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం వల్ల ఫలితం మారి ఉండవచ్చని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సినిమాలో అనేక అంశాలు ఉన్నా, ఎక్కడా బాగోలేదని అనడానికి లేదని, సెకండాఫ్‌లో ఒక పావు గంట తీసేసి ఉంటే, ‘ఫ్యామిలీస్టార్‌’ మరో రకంగా ఉండేదని తనకు అనిపించినట్లు చెప్పారు. మృణాల్‌ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీని పరశురామ్‌ తెరకెక్కించారు. దిల్‌రాజు నిర్మించారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో వివిధ సినిమాలను విశ్లేషిస్తూ, దర్శకత్వం వైపు రావాలనుకునే వారికి పాఠాలు చెబుతున్న ఆయన ‘ఫ్యామిలీస్టార్‌’ను విశ్లేషించారు.

‘‘ఫ్యామిలీస్టార్‌’ రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ అన్నారు. యాక్షన్‌ డ్రామా అనే పదం కీలకం. ఈగో కలిగిన ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఒక తెలియని అనుబంధం ఏర్పడితే, అది ఎన్నిరకాల పరిణామాలను చవి చూస్తుందనేది ఈ చిత్ర కథ. కుటుంబం భారమంతా హీరోనే మోస్తాడు. అలాంటి వ్యక్తి ఇంటి పైన కథానాయిక అద్దెకు దిగుతుంది. వీరిద్దరి మధ్య తెలియని రొమాన్స్‌ డెవలప్‌ అవుతోందని ప్రేక్షకుడు ఆలోచనలో పడతాడు. వారిద్దరూ ఎక్కడో ఒక చోట కనెక్ట్‌ అవుతారని, ఈగో ఫ్యాక్టర్‌ కారణంగా, గొడవలవుతాయని మనల్ని ఊహించేలా దర్శకుడు చేశారు. సినిమాలో హీరోని పీనాసి వాడిలా చూపించారు. కానీ, అతను అతి జాగ్రత్తపరుడు. సినిమాను కథా భాగాలుగా విభజిస్తే, హీరోయిన్‌ వచ్చిన తర్వాత ఆమెకో కథ ఉంటుంది. హీరో.. హీరోయిన్‌తో గొడవపడి యూఎస్‌ వెళ్లడంతో ఒక కథ, హీరోయిన్‌ మిస్సయిన తర్వాత మరో కథ.. ఇలా చాలా కథలున్నాయి. కథా, కథా చాతుర్యంతో దర్శకుడు ఆడుకున్నాడు. కానీ, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అందుకు కారణం.. హీరో బాడీ లాంగ్వేజ్‌కు ఉన్న యూత్‌, లవ్‌ ఫీల్‌ను మించి ఒక యాక్షన్‌ హీరో బాడీ లాంగ్వేజ్‌ని ఆపాదించారు. హీరో ఇమేజ్‌ కన్నా విభిన్నంగా అతడితో ఫైట్స్‌ చేయడం వల్ల మూవీ దెబ్బతిందని నా అభిప్రాయం. హీరోను ఇష్టపడుతున్న సంగతి హీరోయిన్‌ చెబుదామనుకున్న ప్రతిసారీ అతడు వినడు. ఒకవేళ ఆ అమ్మాయి మొండిగా ‘ఐ లవ్‌ వ్యూ’ అని ఉంటే కథ వేరేలా ఉండేది’’

‘‘ఇక ఇల్లు వాస్తు గురించి చెబుతూ రవిబాబుతో ఫైట్‌ చేయడం ఆసక్తికరంగా ఉంది. విరామ సన్నివేశాల వరకూ ఒక ఫీల్‌గుడ్‌ మూవీలా ఆశ కల్పిస్తూ తీసుకెళ్లి, ఇద్దరూ బ్రేకప్‌తో ఇంటర్వెల్‌ వేశాడు. మళ్లీ ఎలా కలుస్తారన్న ఆసక్తిని కలిగించాడు. విచిత్రం ఏంటంటే, ఆ అమ్మాయి ఉన్న ఆఫీస్‌లోనే హీరో పని చేస్తాడు. సెకండాఫ్‌లో హీరో ఫ్యామిలీకి హీరోయిన్‌ సాయం చేస్తుండటంతో ఆమె గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. దీంతో హీరో తగ్గిపోయాడు. హీరోను హీరోయిన్‌ అపార్థం చేసుకుని, దూరమయ్యే ప్రేమ కథలు ఎక్కువగా హిట్‌ అవుతాయి. కానీ, హీరో తన ఈగోతో హీరోయిన్‌ను దూరం చేసుకుంటున్నాడన్నది ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాలేదు. ఫస్టాఫ్‌లో బాగానే ఉన్నా, సెకండాఫ్‌లో సమస్యలు కూడా లేవు. కోమా స్టేజ్‌లో ఉన్న వ్యక్తితో పెళ్లి చేయాలన్న కాన్సెప్ట్‌ తీసుకురావడం, వేరే అతను ఈ అమ్మాయిని తీసుకెళ్లాడన్న పాయింట్‌ను లాక్‌ చేయడంతో సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే గ్రిప్‌ తప్పింది’’

‘‘జగపతిబాబు పాత్ర హీరోయిన్‌ గురించి చెప్పకపోతే ఇద్దరూ విడిపోతారేమో అనిపించేలా దర్శకుడు కథనాన్ని నడిపాడు. విజయ్‌ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు మించి చివరిలో 50-60మందిని కొట్టడం ఆడియెన్స్‌ ఆమోదిస్తున్నారేమో తెలియదు. పాత సినిమాలో జరిగిన వాటిని దాటి ఇలా తీస్తున్నారు. పైగా క్లైమాక్స్‌లో చిన్న మెలో డ్రామా సీక్వెన్స్‌ చూపించారు. ఈ కథ విజయ్‌ దేవరకొండథే. కథనంలో బాడీ లాంగ్వేజ్‌ను దాటిన ట్రీట్‌మెంట్‌ ఉంది. సినిమా అక్కడక్కడా మాత్రమే బాగోలేదు. సెకండాఫ్‌లో ఒక పావు గంట తీసేసి ఉంటే ఇంకో రకంగా ఉండేదా? అన్నది నా ఫీలింగ్‌. విజయ్‌ దేవరకొండ లవర్‌ బాయ్‌. ఆయనను దృష్టిలో పెట్టుకుని కథలు రాసేటప్పుడు ఆడిటోరియానికి సరిపోయేలా ట్రీట్‌ రాస్తే, ఆ సినిమాలు ఎక్కువ హిట్‌ అయ్యే అవకాశం ఉంటుంది’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు