Paruchuri Gopala Krishna: అదే నా బ్యాడ్‌ లక్‌.. ‘కాంతార’పై పరుచూరి అభిప్రాయమిదే

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని అన్నారు.

Updated : 11 Dec 2022 17:51 IST

హైదరాబాద్‌: రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘కాంతార’పై (Kantara) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). కన్నడ సంస్కృతి, సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో ఎలాంటి లోపాలు లేవని.. ఇది అత్యద్భుతంగా ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన ‘పరుచూరి పలుకులు’ వేదికగా తాజాగా ‘కాంతార’పై రివ్యూ చెబుతూ వీడియో షేర్‌ చేశారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తాను థియేటర్‌లో చూడలేకపోయానని, అది తన బ్యాడ్‌లక్‌ అని అన్నారు.

‘‘ఇదేదో ఆత్మలకు సంబంధించిన సినిమా అనుకున్నా. విశేష ప్రేక్షకాదరణ పొందడంతో ఇటీవల సినిమా చూశా. నాకెంతో నచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఓ ప్రాంతంలో జరిగిన కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇదొక అభ్యుదయ చిత్రం. మన తెలుగులో వచ్చిన ‘మా భూమి’ లాంటి చిత్రమిది. ఆ సినిమాలో ప్రజలు పోరాడారు. ఈ సినిమాలో ఓ భూతకోల కళాకారుడు పోరాటం చేశాడు’’

‘‘ఇందులో ఎన్నో విషయాలను మెచ్చుకోవాలి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే. రిషబ్‌శెట్టి (Rishab Shetty).. కథ, కథనం అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రథమార్ధం చూసినప్పుడు జమీందారే విలన్‌ అని ఎవరూ అనుకోరు. అటవీ అధికారే ప్రతినాయకుడు అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. అడవి మీద కన్ను వేసింది జమీందారే అని చూపించి.. సెకండాఫ్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. జమీందార్‌ పాత్రధారిగా అచ్యుత్‌కుమార్‌ నటన అదిరిపోయింది. ఆయన ఒక్కడే కాదు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ సహజంగా నటించారు. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన ఆమెను ఏ నటితో పోల్చాలో అర్థం కావడం లేదు. ఆమె సినిమా నటి అంటే ఎవరూ నమ్మరు. అడవిలో ఉండే అమ్మాయి ఈ పాత్ర పోషించారా అనే భావన కలిగేంత సహజంగా ఆమె సినిమాలో లీనమైంది. ఆమెకు హ్యాట్సాఫ్‌. క్లైమాక్స్‌ కూడా అద్భుతంగా ఉంది. నటన, స్క్రీన్‌ప్లే, కథ, కథనం.. ఇలా ఏ విషయంలోనూ లోపాలు కనిపించలేదు. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని అందించారు’’ అని పరుచూరి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని