Naa Saami Ranga: ‘నా సామిరంగ’ బాగుంది కానీ..: పరుచూరి గోపాలకృష్ణ

నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

Published : 24 Feb 2024 10:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమా బాగున్నా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) అభిప్రాయం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఆ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, మిర్నా మేనన్‌, రుక్సర్‌ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Naa Saami Ranga On Disney+ Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, దీనికి గురించి పరుచూరి ఏమన్నారంటే?

‘‘ఈ సినిమా బాగుంది. కానీ, వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఏ నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకైనా సంతృప్తిన్నిచ్చే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఆ జాబితాలోదే ఈ సినిమా. మంచి ఎంటర్‌టైనర్‌. దాసరి నారాయణరావుగారి టెక్నిక్‌ను యువ దర్శకులు ఫాలోకావడంలేదు. ఆయన సినిమాలన్నింటిలో ఆఖరి అరగంటకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. దీంతో, ముందు నుంచీ ఎలా ఉన్నా సినిమాని చివరిలో ప్రేక్షకులు కళ్లార్పకుండా చూసేవారు. ‘నా సామిరంగ’ విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో రొమాన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. నవ్వులు పంచారు. సెకండాఫ్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీకి దర్శకుడిగా తొలి చిత్రమిది. మలయాళ సినిమా (పొరింజు మరియమ్‌ జోస్‌) కథను తీసుకుని కొన్ని మార్పులతో తెరకెక్కించారు’’

‘‘ఒక చిత్రాన్ని ఓ హీరో బాడీ లాంగ్వేజ్‌ నుంచి మరో హీరో బాడీ లాంగ్వేజ్‌కు మార్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ మూవీలోని నటుల ఆహార్యం ఎలా ఉంటుందో ఇందులోనూ అలానే చూపించే ప్రయత్నం చేశారు. గెడ్డం పెంచి, లుంగీ ధరించి నాగార్జున కొత్తగా కనిపించారు. కిష్టయ్య పాత్రను ఆయన ప్రేమించారు. కళ్లతోనే నటించి, అలరించారు. రావు రమేశ్‌ పాత్రను ఇంటర్వెల్‌లో ముగించకుండా ఉండుంటే బాగుండేదనేది నా అభిప్రాయం’’

‘‘ఆ క్యారెక్టర్‌ అక్కడితో ఎండ్‌కావడంతో సెకండాఫ్‌లో కొత్త విలన్‌ వస్తాడని, కొత్త ప్రయాణం మొదలవుతుందని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. కుమార్తెను భయపెట్టేందుకే రావు రమేశ్‌ పాత్రను అలా మలిచారని అనుకుంటున్నా. ఆ రోల్‌ను అంతం చేయకుండా ఉండుంటే కథనం ఇంకా బిగువుగా ఉండేదని భావిస్తున్నా. విజయ్‌ బిన్నీ ఎంతో ఆలోచించి అలా చేసుండొచ్చు. అల్లరి నరేశ్‌ పాత్రనూ అంతం చేయడం ఇబ్బందిగా అనిపించింది. పెద్ద హీరో సినిమాలో ఆయన పక్కన ఉండే క్యారెక్టర్లు చనిపోతే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. హీరో.. విలన్లను చంపుతూ వెళ్తే సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయి. విలన్లు.. హీరో మనుషులను చంపుతూ వెళ్తే దెబ్బతింటాయి. కానీ, ఈ చిత్రం దాన్నుంచి లక్కీగా బయటపడింది. ఆ రెండు పాత్రలను అంతం చేయకుండా ఉండుంటే మరిన్ని వసూళ్లు రాబట్టేదీ సినిమా. నాజర్‌గారు పోషించిన పాత్ర ఆఖరిలో చేసిన పని కూడా నన్ను ఆకట్టుకోలేదు. వీటిలో మార్పులు చేసుంటే ఇంకా బాగుండేది. చిత్ర బృందానికి అభినందనలు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని