Paruchuri Gopala Krishna: ‘వీర సింహారెడ్డి’.. ఆ సీన్‌ పెట్టుంటే సినిమా ఆడేది కాదు: పరుచూరి

‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాపై తన అభిప్రాయాన్నివెల్లడించారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఈ సినిమా ఫస్టాఫ్‌ తనకెంతో నచ్చిందని అన్నారు.

Updated : 04 Mar 2023 15:32 IST

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం ఇది ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే ‘వీర సింహారెడ్డి’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). ఈ సినిమా చూస్తుంటే ఎన్టీఆర్‌ నటించిన ‘చండశాసనుడు’ (Chanda Sasanudu) గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు.

‘‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని చూశాను. బాలయ్య (Balayya) యాక్టింగ్‌ బాగా నచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు.. మేము రచయితలుగా వ్యవహరించిన ఎన్టీఆర్‌ ‘చండశాసనుడు’ సినిమా నాకు గుర్తుకు వచ్చింది. ఎందుకంటే, ఈ రెండు చిత్రాల్లోని కథాబీజం కాస్త ఒకేలా ఉంటుంది. ‘చండశాసనుడు’లో ప్రేమ వల్ల అన్నాచెల్లెళ్ల మధ్య వైరం.. అన్నయ్య నాశనమైపోవాలని చెల్లి కోరుకోవడం.. ఆయన ఇంటికే వెళ్లి శాపనార్థాలు పెట్టడం.. ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలోనూ అలాంటి సన్నివేశాలనే చూడొచ్చు. కాకపోతే, ఒకటే వ్యత్యాసం.. ‘చండశాసనుడు’లో చెల్లికి మంచి భర్త ఉంటాడు. ఈ సినిమాలో చెల్లి (వరలక్ష్మి).. అన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం విలన్‌(దునియా విజయ్‌)నే పెళ్లి చేసుకుంటుంది’’.

‘‘బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడేలా డైలాగ్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాని చూసినప్పుడు నాకు బోయపాటి శ్రీను సినిమా చూస్తున్న భావన కలిగింది. ఎందుకంటే బాలయ్య నటన, ఆయన డైలాగ్‌ డిక్షన్‌, హావభావాలు.. అన్నీ ‘సింహా’, ‘లెజెండ్‌’ల్లో చూసినట్టే ఉంది. ‘వీర సింహారెడ్డి’ ఫస్టాఫ్‌ బంగారం. కానీ, సెకండాఫ్‌ అంతగా లేదనేది నా అభిప్రాయం’’.

‘‘లెవన్త్‌ అవర్‌ గురించి మాట్లాడితే.. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది ఉన్నట్టుండి ఖాళీగా కూర్చొంటే చూడాలనిపించదు. పులి గాండ్రింపు ఎప్పుడూ అలాగే ఉండాలి. అన్నాచెల్లెళ్ల అనుబంధం కాబట్టే ఈ సినిమా దాదాపు రూ.130 కోట్లు వసూళ్లు చేయగలిగింది. వీర సింహారెడ్డి పాత్ర చనిపోయాక ఆయన చేసిన త్యాగం ఏమిటనేది జై సింహారెడ్డికి తెలుస్తుంది. అది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌కు అంత సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నవీన్‌ చంద్రను చంపేసింది విలనేనని సినిమా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది.  ఒకవేళ నవీన్‌ చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్టే ఈ సినిమాలో చూపించి ఉంటే ఇది ఆడేది కాదు’’.

‘‘ప్రాథమిక లోపం ఏమిటంటే.. వీరసింహారెడ్డి పాత్రను ముందే ముగించి ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడం.  ‘వీర సింహారెడ్డి’ కొన ఊపిరిలో ఉండటం.. జైసింహారెడ్డి ఆయన్ని సొంతూరికి తీసుకురావడం.. ఆ సమయంలో తండ్రి గురించి ఫ్లాష్‌బ్యాక్‌ తెలుసుకుని ఉంటే ప్రేక్షకులకు సైతం అది వినాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడని ప్రేక్షకులకు తెలిసిందో.. అభిమానులకు ఒక నిరాశ వచ్చేస్తుంది. అలా కాకుండా ఫ్లాష్‌బ్యాక్‌ తెలుసుకున్న తర్వాత జై సింహారెడ్డి.. విలన్‌పై పోరాడి.. అత్తకు నిజం తెలిసేలా చేసి.. చివరికి తన తండ్రి, మేనత్తకు సమాధులు కట్టినట్టు లాస్ట్‌ షాట్‌లో చూపించి ఉంటే సినిమా మరోలా ఉండేదనేది నా భావన. అనవసరమైన నిడివి ఎక్కువగా పెట్టుకోకూడదు. అలాగే, తన తండ్రిని చంపిన వాళ్లల్లో హీరోయిన్‌ తండ్రి కూడా ఉన్నాడని.. చివర్లలో హీరో ఆయన్ని కూడా కొట్టినట్టు చూపించారు. ఆ తర్వాత ఆయన ఏం అయ్యాడు? హీరో - హీరోయిన్‌కు పెళ్లి జరిగిందా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లందరూ ఏమయ్యారు? ఇలాంటి వాటిని చూపించకుండా సడెన్‌గా సినిమా ముగిసిపోయినట్టు ఉంది. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలన్నింటినీ జయించి ఈ సినిమా రూ.134 కోట్లు వసూళ్లు రాబట్టిందంటే దానికి ఒకే ఒక్క కారణం బాలయ్య’’ అని పరుచూరి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని