Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్‌’ ఖాతాలో మరో రికార్డు

షారుఖ్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పఠాన్‌’. మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

Published : 29 Jan 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విడుదలకు ముందు విమర్శలతో ‘టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’గా నిలిచిన ‘పఠాన్‌’ (Pathaan) విడుదల అనంతరం అత్యధిక వసూళ్లు చేస్తూ వావ్‌ అనిపిస్తోంది. జనవరి 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్‌ను సినీ విశ్లేషకులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 313 కోట్ల (గ్రాస్‌) బిజినెస్‌ చేసిందని తెలిపారు. ఇండియాలో రూ. 201 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 112 కోట్ల వసూళ్లు చేసిందని వివరించారు. అనతికాలంలో రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హిందీ సినిమా ఇదేనని పేర్కొన్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన మూవీ ఇది. హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan), హీరోయిన్‌ దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం నటనకు, యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఓ పాట విషయంలో ఈ సినిమా విడుదలకు ముందు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వాటిని అధిగమించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే తన క్రేజ్‌ చూపించిందీ చిత్రం. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. రెండు, మూడో రోజూ అదే స్థాయిలో హవా కొనసాగించింది. 32 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో హౌజ్‌ఫుల్‌ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ బృందం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని