Ram Charan: రామ్‌చరణ్‌కు పవన్‌కల్యాణ్‌ అభినందనలు

రామ్‌చరణ్‌ (ram charan)కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) అభినందనలు తెలిపారు. చరణ్‌ మరెన్నో అద్భుత చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు.

Published : 12 Apr 2024 14:43 IST

హైదరాబాద్‌: నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan)కు వేల్స్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన బాబాయ్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఆనందం వ్యక్తంచేస్తూ చరణ్‌కు అభినందనలు తెలిపారు. ‘‘చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపుతెచ్చుకున్న రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషంగా ఉంది. చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతను చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్‌ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహం. ఈ స్ఫూర్తితో అతను మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరెన్నో పురస్కారాలు.. మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి చరణ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయనకు గౌరవ డాక్టరేట్‌ అందించనున్నారు.

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. అంజలి, ఎస్‌.జె.సూర్య, జయరామ్‌, సునీల్‌, నాజర్‌, శ్రీకాంత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబుతో చరణ్‌ ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. జాన్వీకపూర్‌ కథానాయిక. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. పవన్‌ చేతిలో ప్రస్తుతం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని