Pawan kalyan: ‘గ్లాస్‌..’ డైలాగ్‌పై మరోసారి స్పందించిన పవన్‌.. థ్యాంక్స్‌ చెప్పిన హరీశ్ శంకర్

‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’లోని గ్లాస్‌ డైలాగ్‌పై పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను హరీశ్‌ శంకర్‌ షేర్‌ చేశారు.  

Published : 02 Apr 2024 00:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh). పవన్‌ కల్యాణ్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ దీనిపై అంచనాలను పెంచగా.. తాజాగా పవన్‌ దీనిపై చేసిన కామెంట్స్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ను పెంచాయి.

‘భగత్స్‌ బ్లేజ్‌’ పేరుతో ఇటీవల ఈ చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియో పంచుకున్న విషయం తెలిసిందే. అందులో ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’,  ‘గ్లాస్‌ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ సాగే డైలాగ్స్‌ సోషల్ మీడియాను ఊపేశాయి. తాజాగా వీటిపై పవన్‌ ఓ మీటింగ్‌లో మాట్లాడారు. ‘‘సినిమాలో అలాంటి డైలాగులు ఎందుకని హరీశ్‌ను అడిగాను. ‘మీకు తెలియదు.. మా బాధలు మాకున్నాయి. ఇలాంటి డైలాగులు రాయకపోతే అభిమానులు ఊరుకోరు’ అని సమాధానం చెప్పాడు’’ అంటూ పవన్‌ ఆ డైలాగ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన దర్శకుడు.. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్‌. మీరు అంగీకరించాలే కానీ.. ఇలాంటివి ఇంకా రాస్తా’ అని క్యాప్షన్ పెట్టారు.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో పవన్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మొదట గతేడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని