Vikram: తెలుగు సినిమాల విషయంలో అప్పుడు నేననుకున్నది జరగలేదు కానీ: విక్రమ్‌

విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, శోభిత, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

Updated : 23 Apr 2023 22:58 IST

హైదరాబాద్‌: తన కెరీర్‌ ప్రారంభంలో తెలుగు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించానని, ఆ సమయంలో ఎవరైనా పెద్ద దర్శకుడితో కలిసి పనిచేయాలని ఉండేదని, ఆ కల నెరవేరలేదని ప్రముఖ హీరో విక్రమ్‌ (Vikram) నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. తన కొత్త సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మనసులో మాట బయటపెట్టారు. ఈయనతోపాటు జయం రవి (Jayam Ravi), కార్తి (Karthi), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai Bachchan), త్రిష (Trisha Krishnan), శోభిత, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కలిసి నటించిన ఆ పాన్‌ ఇండియా చిత్రాన్ని మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ (Ponniyin Selvan 1)కు కొనసాగింపుగా రూపొందిన ‘పీఎస్‌ 2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకకు రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై, బిగ్‌ టికెట్‌ ఆవిష్కరించారు.

ఇంత ఉత్సాహం ఎక్కడా చూడలేదు: విక్రమ్‌

‘‘సినిమా త్వరలో విడుదలకాబోతున్న సందర్భంగా మేం ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రేక్షకులను కలుసుకున్నాం. మీ అంత ఉత్సాహం ఎక్కడా చూడలేదు. పలు తెలుగు సినిమాల చిత్రీకరణ కోసం నేను హైదరాబాద్‌లో తిరిగా. పంజాగుట్ట సర్కిల్‌, బంజారాహిల్స్‌ తదితర ప్రదేశాలు నాకు బాగా గుర్తున్నాయి. టాలీవుడ్‌ అగ్ర దర్శకులతో పనిచేయాలని ఆ సమయంలో కోరిక ఉండేది. కానీ, అది నెరవేరలేదు. ఓటీటీకి ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెబుతున్నా. ఎన్నో సరిహద్దులను అది చెరిపేసింది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ఇక్కడ పెద్ద విజయం అందుకుంది. నేరుగా నేను తెలుగు సినిమాలో నటించినంత ఆనందాన్ని మీ ఆదరణ ఇచ్చింది’’ అని విక్రమ్‌ పేర్కొన్నారు.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఐశ్వర్యరాయ్‌

‘‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’పై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ నెల 28న విడుదలకాబోతున్న ‘పీఎస్‌ 2’కు మీ ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నా. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన మణిరత్నంగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా సినిమాకు ఆయన్నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా’’ అని ఐశ్వర్యరాయ్‌ వివరించారు.

ప్రచారం కోసం రాలేదు: జయం రవి

‘‘నేను హైదరాబాద్‌లోనే పెరిగా. ఇప్పటికీ ఇందిరానగర్‌లో మా ఇల్లు ఉంది. సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకుల్లో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పురాలేదు. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకే మేం ఇక్కడికి వచ్చాం తప్ప ప్రమోషన్స్‌ కోసం కాదు. ‘పీఎస్‌ 1’లానే ఈ ‘పీఎస్‌ 2’ను ఆదరిస్తారని నమ్ముతున్నా. రెండు భాగాలున్న సినిమాను ఒకేసారి తెరకెక్కించి, సుమారు ఆరు నెలల వ్యవధిలో విడుదల చేసినందుకు మణిరత్నం ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ప్రపంచంలో ఏ దర్శకుడూ రెండు పార్ట్‌లను ఒకేసారి తీయలేదు’’ అని జయం రవి అన్నారు.

పీఎస్‌ 2 క్లాసిక్‌: కార్తి

‘‘గోల్డెన్‌ డేస్‌ అనగానే విద్యార్థులు కాలేజీ రోజులు గుర్తుచేసుకుంటారు. అలానే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కు పనిచేసిన రోజులన్నీ మాకు గోల్డెన్‌ డేస్‌. రెండు పార్ట్‌లు ఒకేసారి తెరకెక్కాయి. అవి పూర్తయిన తర్వాత సినిమా ఎలా ఉందని కెమెరామ్యాన్‌ను అడిగితే ‘పీఎస్‌ 1’ను ఎంటర్‌టైనింగ్‌ అని, ‘పీఎస్‌ 2’ని క్లాసిక్‌ అని అభివర్ణించారు. నా ‘ఖైదీ 2’ చిత్రం త్వరలోనే వస్తుంది’’ అని కార్తి తెలిపారు.

హైదరాబాద్‌.. హోమ్‌టౌన్‌: త్రిష

‘‘హైదరాబాద్‌ ఎప్పుడూ నా హోమ్‌టౌన్‌లానే అనిపిస్తుంది. ‘పీఎస్‌ 1’లో పాత్రల పరిచయం, కొన్ని పాటలు చూశారు. ‘పీఎస్‌ 2’లో అసలు కథ మొదలవుతుంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి ఈ చిత్రాన్ని చూడండి. మమ్మల్ని ఆదరించండి’’ అని త్రిష.. ప్రేక్షకుల్ని కోరారు.

అద్భుతం చూడబోతున్నాం: దిల్‌రాజు

‘‘మణిరత్నంగారి ‘గీతాంజలి’ నా ఫేవరెట్‌ మూవీ. ఆయన తీసిన ‘అమృత’తో నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. తెలుగు రాష్ట్రాల్లో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ విడుదల చేసే అవకాశం మాకు ఇచ్చారు. దాని సీక్వెల్‌నూ మేం రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘పీఎస్‌ 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అని దిల్‌రాజు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని