Poonam Pandey: ఈసారి లీగల్‌ నోటీసులపై అవగాహన కల్పిస్తున్నారా?: పూనమ్‌ పాండేకు నెటిజన్ల ప్రశ్న

పూనమ్‌ పాండే పెట్టిన తాజా పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ఇప్పుడు లీగల్‌ నోటీసులపై అవగాహన కల్పిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

Updated : 20 Feb 2024 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే (Poonam Pandey) చనిపోయినట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టి, ఆ తర్వాత అదంతా అబద్ధమంటూ కొన్ని రోజుల కిందట ఆమె చేసిన ప్రకటన సంచలనమైన సంగతి తెలిసిందే.. సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకే తాను అలా చేసినట్లు చెప్పడంపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పూనమ్‌ ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకుందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు కాన్పూర్‌ కోర్టులో రూ.100 కోట్లకు దావా కూడా దాఖలైంది. మరోవైపు, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ‘అవగాహన కోసం ఇలా చేశాను’ అని చెప్పిన వీడియోను పూనమ్‌ తొలగించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామం తర్వాత ఆమె పెట్టే పోస్ట్‌లపై నెటిజన్లలో ఆసక్తి నెలకొంది.

‘నిజం త్వరలోనే బయటకొస్తుంది’ అని కొన్ని రోజుల క్రితం పోస్ట్‌ పెట్టిన ఆమె, తాజాగా మరో అప్‌డేట్‌ షేర్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘నిజం బయటకొస్తుందని నేను చెప్పడం వల్ల స్టేక్‌ హోల్డర్స్‌ (వాటాదారులు) వణికిపోతున్నారు. లీగల్‌ నోటీసులు పంపారు’ అంటూ మరోసారి అందరి దృష్టిని తనపై ఉండేలా చేశారు. అంతకుమించి మరే వివరాలు పంచుకోకపోవడంతో ‘ఇదో రకమైన పబ్లిసిటీనా?’, ‘మీరు నిజంగా ఉన్నారా? ఈ ఖాతాను మీ టీమ్‌ వినియోగిస్తుందా?’, ‘ఇప్పుడు లీగల్‌ నోటీసులపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ వల్ల పూనమ్ మృతి చెందారంటూ ఆమె వ్యక్తిగత ఖాతాలో సిబ్బంది ఫిబ్రవరి 2న పోస్ట్‌ పెట్టారు. మరుసటి రోజు తానే స్వయంగా వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత, ఇందులోభాగమైన ఓ డిజిటల్‌ ఏజెన్సీ అందరికీ క్షమాపణలు చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని