Prasanna Vadanam: ‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సుహాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. 

Published : 18 May 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయకుడిగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న నటుడు సుహాస్‌ (Suhas). ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ సమస్యతో బాధపడే వ్యక్తిగా ఆయన నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam). పాయల్‌ రాధాకృష్ణ (Paayal Radhakrishna) హీరోయిన్‌. రాశీసింగ్‌ (Rashi Singh) కీలకపాత్ర పోషించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అర్జున్‌ వైకే తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికి 24 గంటల ముందే అందుబాటులో ఉండనుంది. ఈనెల 3న థియేటర్లలో విడుదలైందీ సినిమా.

క‌థేంటంటే: సూర్య (సుహాస్‌) రేడియో జాకీగా పని చేస్తుంటాడు. ఓ ప్ర‌మాదం అత‌డి జీవితాన్ని త‌లకిందులు చేస్తుంది. అమ్మానాన్న‌ల్ని కోల్పోవ‌డంతోపాటు.. ఫేస్ బ్లైండ్‌నెస్‌ (ప్రోసోపాగ్నోసియా) స‌మ‌స్య బారిన ప‌డతాడు. ఎవ‌రినీ గుర్తు ప‌ట్ట‌లేని పరిస్థితి. వాయిస్‌నీ గుర్తించ‌లేడు. త‌న స్నేహితుడు విఘ్నేష్ (వైవా హ‌ర్ష‌)కి త‌ప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటూ కాలం గ‌డుపుతుంటాడు. ఆద్య (పాయల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇంత‌లోనే త‌న క‌ళ్ల ముందు ఓ హ‌త్య జ‌రుగుతుంది. త‌న‌కున్న స‌మ‌స్య‌తో ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసుకోలేడు. కానీ, పోలీసుల‌కి ఈ విష‌యం తెలిపేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఆ వెంట‌నే అత‌నిపై దాడి జ‌రుగుతుంది. అయినా వెన‌క‌డుగు వేయ‌ని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్‌) ద‌గ్గ‌రికి వెళ్లి జ‌రిగిన విష‌యం చెబుతాడు. త‌నకున్న స‌మ‌స్య‌నీ వివ‌రిస్తాడు. అనూహ్యంగా ఆ హ‌త్య కేసులో సూర్య‌నే ఇరుక్కోవాల్సి వ‌స్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? హ‌త్య‌కి గురైన అమ్మాయి ఎవ‌రు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? అస‌లు నిందితులు ఎప్పుడు, ఎలా బ‌య‌టికొచ్చారు? సుహాస్ ప్రేమ‌క‌థ ఏ తీరానికి చేరింది? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని