Salaar: ‘సలార్‌’ పేరుతో పూజ చేయించిన ప్రశాంత్‌ నీల్.. విడుదల కోసమేనా?

ప్రశాంత్ నీల్‌- ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘సలార్’ (Salaar). తాజాగా మరో అంశం కారణంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Published : 07 Sep 2023 15:55 IST

హైదరాబాద్‌: ‘కేజీఎఫ్‌’తో తన ప్రతిభను నిరూపించుకుని ఎంతో మందికి అభిమాన దర్శకుడిగా మారారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా ‘సలార్‌’. గత కొన్ని రోజు నుంచి వార్తల్లో ఉంటున్న ఈ సినిమా.. తాజాగా మరో అంశంతో కారణంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

కృష్ణాష్టమి సందర్భంగా ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel) తన కుటుంబంతో కలిసి సత్యసాయి జిల్లాలోని సొంత ఊరు నీలకంఠపురం వెళ్లారు. అక్కడ తన తండ్రి సమాధికి నివాళులర్పించారు. అనంతరం ఆ గ్రామంలోని గుడిలో పూజ చేయించారు. అయితే అందులో తన కుటుంబసభ్యుల పేర్లు చెప్పిన ప్రశాంత్‌ నీల్‌.. వాటితో పాటు ‘సలార్’ పేరు కూడా చెప్పారు. సినిమా విజయం సాధించాలని ప్రార్థించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాల విడుదలకు ముందు ఇలా పూజ చేయిస్తారని సమాచారం. గతంలో ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌2’ సినిమా రిలీజ్‌లకు ముందు ఇలానే పూజ చేయించారట. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ‘సలార్‌’ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 28న దీన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ విడుదల కోసమే ప్రశాంత్ నీల్ పూజ చేయించారని తెలుస్తోంది. 

ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/సిరీస్‌లు!

మరోవైపు ‘సలార్‌’ (Salaar) రిలీజ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇప్పటి వరకూ స్పందించలేదు. అలాగే విదేశాల్లో ఈ సినిమా టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించగా.. అవి భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనునట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని